అసెంబ్లీకి రాని కెసిఆర్‌కు ప్రధాన ప్రతిపక్ష నాయకుని హోదా ఎందుకని, అసలు అసెంబ్లీ అంటే కెసిఆర్‌కు ఎందుకంత భయం అని డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు.. ప్రతిపక్ష నాయకుడిగా రెండు సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రాలేదని ఆయన నిలదీశారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం పాత పినపాక ,అన్నారుగూడెం, లింగాల గ్రామాల్లో నూతనంగా నిర్మించే 33/11 కె వి విద్యుత్ సబ్ స్టేషన్ లకు ఆయన శంకుస్థాపన చేశారు.అనంతరం స్థానికంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం ప్రసంగించారు. పదిమంది నాయకులను పక్కన కూర్చోబెట్టుకొని ప్రజల కోసం పనిచేస్తున్న వారిని తోలు వలుస్తాం .. తీస్తాం అంటే ఇక్కడ ఎవ్వరూ చూస్తూ ఊరుకోరని, అసలూ ఆయన తోలు వలిచే ఉద్యోగం ఎప్పుడు తీసుకున్నారో ? చెప్పాలని ఆయన ఎద్దేవా చేశారు. రెండు సంవత్సరాల పాటు ఫామ్ హౌస్ లో పడుకొని నిన్న, మొన్న ఒక పెద్దాయన మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు అంటే ప్రజా ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమాలు చక్కగా జరుగుతున్నాయి మంచిగా చేయండి అని ఆశీర్వదిస్తారని భావించాం కానీ ఆయన తోలు తీస్తాం అంటే ఇక్కడ ఖాళీగా ఎవరూ లేరని ఆయన ఘాటుగా బదులు ఇచ్చారు.
తాము ప్రతిపక్షంలో ఉన్న పది సంవత్సరాలు ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా తాను ఏ ఒక్కరోజు అసెంబ్లీకి గైర్హాజరు కాలేదని, ప్రతిరోజు ప్రజల సమస్యలపై అసెంబ్లీలో గళం వినిపించామని భట్టి తెలిపారు.ప్రజలకు పనికొచ్చే సంక్షేమ పథకాలు చేపడుతున్నాం కాబట్టే ప్రజలు కాంగ్రెస్ బలపరిచిన 85శాతం మందిని సర్పంచులు గా గెలిపించి పంపిస్తే తోలువలుస్తా అని కేసిఆర్ మాట్లాడుతున్నారు మాకు దిగజారి మాట్లాడడం రాదని, చేతల ద్వారా ప్రజా సంక్షేమ కార్యక్రమాల ద్వారా బీఆర్‌ఎస్ నేతలకు తగిన బుద్ధి చెప్పిస్తామని భట్టి విక్రమార్క అన్నారు.రాష్ట్రంలో అత్యంత ప్రజాస్వామ్య పద్ధతుల్లో సర్పంచ్ ఎన్నికలు జరిగాయి, ఆ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ మద్దతుదారులు ప్రజలకు అన్ని విషయాలు వివరించారు అయినప్పటికీ కాంగ్రెస్ బలపరిచిన 85 శాతం మంది అభ్యర్థులను రాష్ట్ర ప్రజలు గెలిపించి ఆశీర్వదించారని ఆయన తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో నువ్వు పనికిరాని పక్కకు కూర్చోబెట్టారు, తాజాగా సర్పంచ్ ఎన్నికల్లో అంతకన్నా ఎక్కువ మెజారిటీతో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులకు పల్లె ప్రజలు పట్టం కట్టారని డిప్యూటీ సీఎం తెలిపారు. తెలంగాణ రైజింగ్ అవుతుంది, రాష్ట్రానికి దేశవ్యాప్తంగా నాయకులు, బడా పారిశ్రామికవేత్తలు తరలివస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని పొగుడుతున్నారు.
ఈ సమయంలో తాము ఎక్కడ కనిపించకుండా పోతామని ఆందోళనతో రెండు సంవత్సరాల తర్వాత బయటకు వచ్చి రాష్ట్ర ప్రభుత్వం పై విషయం కక్కి తిరిగి ఫామ్ హౌస్ లో పడుకోవడానికి వెళ్లారు మీకు ప్రజలే బుద్ధి చెబుతారని డిప్యూటీ సీఎం అన్నారు. రాష్ట్రంలోని 94 శాసనసభ నియోజకవర్గాల్లో పంచాయతీ ఎన్నికలు జరిగితే 85 శాసనసభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలుపొందారని ఈ మధ్యకాలంలో ఏ రాజకీయ పార్టీకి ఇంత పెద్ద ఎత్తున ప్రజల ఆశీర్వాదం లభించలేదని అన్నారు. ప్రజల మధ్య నిలబడి ప్రజల కోసం ఇందిరమ్మ రాజ్యం నిర్ణయాలు చేయడంతోనే సర్పంచి ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో గెలుపొందారని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మట్టా రాఘమయి మాలోత్ రాందాస్ నాయక్ జిల్లా కలెక్టర్ అనుదీప్,రాష్ట్ర గిడ్డంగులసంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వర్రావు,డిసిసి అధ్యక్షులు నూతి సత్యనారాయణ, ఇతర అధికారులు,కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.