అమరావతి: కన్నతండ్రి ఇద్దరు కూతుళ్లను కాలువలోకి తోసేసి చంపిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. నేమకల్లు గ్రామంలో కల్లప్ప అనే వ్యక్తి భార్య, పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. కల్లప్పకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నాడు. కూతుళ్లు సింధూ, అనసూయ స్థానిక పాఠశాలలో ఐదు, ఆరు తరగతులు చదువుతున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో కూతుళ్లకు మాయమాటలు చెప్పి హెచ్‌ఎల్‌సి కాలువ దగ్గరకు తీసుకెళ్లాడు. పెద్ద కూతురు కాలువలోకి తోసేశాడు. అనంతరం చిన్న కూతురును కాలువలోకి తోయడానికి ప్రయత్నించడంతో తప్పించుకోవడానికి ప్రయత్నించింది. ఆమె గట్టిగా పట్టుకొని కాలువలోకి తోసేశాడు. కూతుళ్లు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు అతడిని నిలదీశారు. కర్నాటకలోని సిరిగేరి క్రాస్ వద్ద కాలువలో తోసేసానని, మరోసారి గ్రామ శివారులోని హెచ్‌ఎల్‌సి కాలువలోకి తీసేశానని వివరణ ఇచ్చాడు. గ్రామస్థులు ప్రశ్నించడంతో కల్లప్ప స్పృహతప్పిపడిపోయాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కాలువలో నుంచి పెద్ద కూతురు అనసూయ మృతదేహాన్ని బయటకు తీశారు. రెండో కూతురు మృతదేహం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.