ప్రస్తుతం జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ అత్యంత ఘోరంగా విఫలమవుతోంది. ఇప్పటికే మూడు మ్యాచుల్లో ఓటమిపాలై సిరీస్‌ని చేజార్చుకుంది. ఏ విభాగంలోనూ ఆసీస్‌కి గట్టి పోటీ ఇవ్వలేకపోతోంది. ఈ నేపథ్యంలో టీం ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఇంగ్లండ్ జట్టుపై ఘోరంగా సెటైర్లు వేశాడు. గురుగ్రామ్‌లో జరిగిన మాస్టర్స్ యూనియన్ స్నాతకోత్సవానికి రోహిత్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా తన కెరీర్‌లో మరుపురాని మైలురాళ్లను రోహిత్ గుర్తు చేసుకున్నాడు.
అందులో భాగంగా 2021లో గబ్బా వేదికగా ఆసీస్‌పై విజయం సాధించిన మ్యాచ్ గురించి రోహిత్ ప్రస్తావించాడు. ‘ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ గెలవడం అంత ఈజీ కాదు. కావాలంటే ఇంగ్లండ్ ఆటగాళ్లను ఆడగండి’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ‘‘2021 గబ్బా వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో మేం (భారత్) గెలిచాము. రిషబ్ పంత్ అద్భుతంగా ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు. మేము గెలుస్తామని ఎవరూ నమ్మలేదు. ఆ స్థితి నుంచి పుంజుకొని టీం ఇండియా గెలిచింది. ఆ మ్యాచ్‌లో మేం అనుకున్న ఆటగాళ్లు గాయలు, ఇతర కారణాల వల్ల అందుబాటులో లేదు. ఆ సమయంలో ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ చేసిన కొన్ని కామెంట్స్ చేశాడు. ఆ కామెంట్స్‌లో ఒకటి మమ్మల్ని ఆలోచనలో పడేసింది’’ అని రోహిత్ అన్నాడు.
‘‘మ్యాచ్ ప్రారంభమైనప్పుడు తుది జట్టులో ముగ్గురు అరంగేట్ర ఆటగాళ్లు ఉన్నారు. గబ్బా ఆసీస్‌కి కంచుకోట. అప్పటి వరకూ అక్కడ ఆసీస్‌కి ఓటమి లేదు. కానీ, గెలుపుపై ఆశలు లేని స్థితి నుంచి మేం పుంజుకొని మ్యాచ్‌లో విజయం సాధించాం. టెస్ట్ క్రికెట్ ఆడటం ఎంత కష్టమో మీ అందరికీ తెలుసు. ఆస్ట్రేలియాలో ఆడటం కఠనమైన సవాలు. కావాలంటే మీరు ఇంగ్లండ్ ఆటగాళ్లను అడగండి. గబ్బాలో విజయం సాధించి. ఆ తర్వాత ఆస్ట్రేలియాలో సిరీస్ గెలవడం మాకు గొప్ప అచీవ్‌మెంట్’’ అని రోహిత్ అప్పటి జ్ఞాపకాలని గుర్తు చేసుకున్నాడు.