మన తెలంగాణ/హైదరాబాద్: ఉత్తరాది నుంచి శీతల గాలులు వీస్తుండడంతో తెలంగాణలో చలి తీవ్రత పెరిగిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర దిశ నుంచి దూసుకొస్తున్న శీతల గాలులు వీస్తుండడంతో చలి ఎక్కువైందన్నారు. సోమవారం ఆదిలాబాద్, పటాన్చెరులో 7.2 డిగ్రీలు, మెదక్ 7.8, రాజేంద్రనగర్ 9, హనుమకొండ 10.5, నిజామాబాద్ 11.7, రామగుండం 11.9 డిగ్రీలు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు వెల్లడించారు. సాధారణంగా ఉండే కనిష్ఠ ఉష్ణోగ్రతలతో పోలిస్తే 3 నుండి 5 డిగ్రీలు తగ్గుతుండడంతో రాత్రి, తెల్లవారుజామున ప్రజలు చలితో వణికిపోతున్నారు. రాబోయే రెండు, మూడు రోజులు ఇదే స్థాయి చలి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఉత్తర, పశ్చమ, ఈశాన్య జిల్లాల్లో శీతల, అతిశీతల గాలులు వీయడంతో చలి ప్రభావం అధికంగా ఉంటుందని వివరించారు. హైదరాబాద్లో రాత్రి వేళల్లో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఉపరితల గాలులు ఉత్తర ఈశాన్య దిశలో వీచే అవకాశం ఉందని పేర్కొంది. చలి తీవ్రతకు సాధారణ జనం గజగజ వణుకుతున్నారు. ఉదయం, రాత్రిపూట బయటికి వెళ్లి పనులు చేసుకోవాలంటేనే బెంబేలెత్తుతున్నారు. చలి ప్రభావం ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులపై అధికంగా ఉంది.