క్రీ.పూ.1వ శతాబ్దానికి చెందిన తెలంగాణ మొదటి లిఖిత కవి గుణాఢ్యుడు కరీంనగర్ పరగణాలోనే పైశాచీ భాషలో ‘బృహత్కథ’ను రచించాడు. రెండువేల సంవత్సరాలకు పూర్వం కరీంనగర్ జిల్లా, కోటిలింగాలలో హాలుడు ప్రాకృతంలో ‘గాథా సప్తశతి’ కవిత్వ సంకలనాన్ని వెలువరించాడు. ఇక్కడ లభించిన ఆధారా ల వల్ల తెలుగు లిపి అత్యంత ప్రాచీనమైందని చరిత్రకారులు భావిస్తున్నారు. క్రీ.శ.10వ శతాబ్దంలో వేములవాడ చాళుక్య రెండవ అరికేసరి ఆస్థాన కవి, పంపకవి సోదరుడు జినవల్లభు డు కురిక్యాలలోని బొమ్మలమ్మ గుట్టపై తొలి తెలుగు కందపద్య శాసనం చెక్కించాడు. పశ్చిమ చాళుక్య ప్రభువు అరికేసరి ఆస్థాన కవి పంపడు వేములవాడలో తొలి కన్నడ కావ్యం ‘విక్రమార్జు న విజయం’ రచించాడు. తొలి తెలుగు ఛందోలక్షణ గ్రంథం ‘కవి జనాశ్రయం’ మల్లియ రేచ న 10వ శతాబ్దిలో వేములవాడలో రాశాడు. 15 వ శతాబ్దపు మడికి సింగన తొలి తెలుగు సంకల న గ్రంథం ‘సకల నీతి సమ్మతము’ను రాసాడు.
వెలిగందల నారయ, వేములవాడ భీమకవి, బహుభాషాకోవిదుడు పి.వి, జ్ఞానపీఠ గ్రహీత సినారె, పద్నాలుగు భాషల భాస్కరుడు ఇలా ఎందరో సారస్వత కృషీవలురు కరీంనగర్ సాహితీ క్షేత్రాన్ని సుశ్యామలం చేశారు. మరెందరో ప్రాతఃస్మరణీయుల ప్రభావం ప్రాభవంతో ఇప్పటికీ కరీంనగర్ నేలపైన కవిత్వం దేదీప్యమానంగా ప్రభవిస్తున్నది.
హనుమకొండలో కాళోజీ మిత్రమండలి నెలనెలా కవుల సమావేశం నిర్వహించేది. అక్కడ సాహిత్యంపై చర్చోపచర్చలు, కవిత్వగానాలు సాగేవి. ‘ఒకే ఒక్క సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక’ అన్న ప్రజాకవి కాళోజి స్పూర్తితోనే కరీంనగర్‌లో ఎన్నీ ల ముచ్చట్లు పురుడు పోసుకున్నాయి. తెలంగాణ రచయితల వేదిక కరీంనగర్ జిల్లా శాఖ ఆగస్టు 21, 2013 రాకిట్ల పున్నమి రోజున అన్నవరం దేవేందర్ ఇంటి మిద్దెమీద ఎన్నీల ముచ్చట్లకు అంకురార్పణ జరిగింది. కరీంనగర్‌లో ఆరంభమై న ఎన్నీల ముచ్చట్లు అనతి కాలంలోనే హుజూరాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, జనగామ, సిద్దిపేట, మంచిర్యాల, బొంబాయి తదితర ప్రాంతాలకు పాకినాయి. ఇలాంటి కలయికలు హైదరాబాదు లో సి.వి.కృష్ణారావు ఆధ్వర్యంలో ‘నెలనెలా వెన్నెల’ పేరుమీద జరుతుండగా, పుష్యమీ సాగర్ కవి మిత్రబృందం కూడా హైదరాబాదులో నెలనెలా కలుసుకుంటున్నారు. అలాగే ‘కవితల చెరువు’ పేర వి.ఆర్.శర్మ కవి మిత్రులు నెలనెలా గుమిగూడుతున్నారు. కవిత్వం కోసమే కవుల కలయికకు వేదిక కావడం ఎన్నీల ముచ్చట్లు సాధించిన ప్రత్యేకత.
ప్రతి పున్నమికి ఒక కవి ఇంటి డాబామీద నిరాటంకంగా ఎన్నీల ముచ్చట్లు కవిత్వోత్సవంగా గత పదమూడేండ్లుగా నిర్విరామంగా, నిర్విఘ్నంగా నడుస్తూ చరిత్రను సృష్టిస్తున్నాయి. దీంతో కరీంనగర్ కొత్త కవుల స్ఫూర్తి కేంద్రకంగా మారిందని చెప్పవచ్చు. మారుమూల పల్లెల్లోని సృజనకారులను వెలికితీయడం, కొత్త గొంతుకల కు వేదికనివ్వడం, నూతన కలాలకు తర్ఫీదునందించడం, తెలంగాణ అస్తిత్వానికి జీవం పోయ డం, సామాజిక స్పృహను పెంచడం, ఉత్తమోత్త మ ప్రజా సాహిత్యానికి ఊతమివ్వడం, ప్రజాప క్షం వహించే మట్టిలోని మాణిక్యాలను సానబెట్ట డం వంటివి ఎన్నీల ముచ్చట్లు లక్ష్యాలు.
నెలనెలా పున్నమి వెన్నెల వెలుగుల్లో కవులంద రూ ఒకచోట కలుసుకుంటారు. మంచి చెడ్డలు మాట్లాడుకుంటారు. ఆతిథ్యపు కవి ఇంటి డాబా పైన తట్టు వేసుకుని, మూడు తరాల కవులు సక లం ముఖలం పెట్టుకొని గుండ్రంగా కూర్చుంటా రు. సమకాలీన ఎతకతలను కవిత్వంగా చెప్పుకుంటారు. ఆ కవిత్వాన్నంతా సాహితీ సోపతి సంస్థ ‘ఎన్నీల కవితా గాన’ సంకలనంగా మరుసటి నెలకల్లా పుస్తకంగా అచ్చు వేస్తుంది. సమావేశానికి కొ త్తగా వచ్చిన వాళ్లతో మొదటగా కవిత్వం చదివించ డం ఇందులో ఆనవాయితి. ఆకాశంలోని చంద్రుని వెన్నెలను ఆస్వాదిస్తూ, కవిత్వం చెప్పటం గొప్ప అనుభూతి. ఆతిథ్యం ఇచ్చే కవి కుటుంబం, బంధువులు ఇదొక ఇంటి పండుగ లెక్క భావిస్తారు. కవులకు ఉపాహారంగా సర్వపిండి, గుడాలు, పులిహోర, రొట్టెలు, సమోసాలు, బిస్కె ట్లు లాంటివి వడ్డిస్తారు. కొందరైతే భోజనాలు పెడతారు. తేనీటి విందును సైతం అందిస్తారు. నలిమెల భాస్కర్ లాంటి పెద్దలు కొత్తగా రాసిన వాళ్ళ కవిత్వంలోని మంచిచెడ్డలను విశ్లేషిస్తారు. తగు సూచనలు చేస్తారు. వచ్చే ఎన్నీల ముచ్చట్లు వేదికను అప్పుడే ఖరారు చేసుకుంటారు. మా ఇంట్లంటే, మా ఇంట్లని వేదికకు ఆతిథ్యం కల్పించడానికి కవులు పోటీ పడుతుంటారు.
ఈ కార్యక్రమం మూస పద్ధతులకు భిన్నమైంది. అధ్యక్ష, అతిథుల్లాంటి సభా మర్యాదలు లేకుం డా అందరూ ప్రతి పున్నమకు ఒకచోట చేరి కవి త్వం వినిపిస్తారు. నిరంతరాయంగానూ, దిగ్విజయంగానూ ఈ కార్యక్రమం కొనసాగడానికి ప్రధాన కారణం కొత్తగా రాయడానికి ప్రయత్నిస్తున్న కవులూ, కవయిత్రులే. ఎన్నీల కవితా గాన సంకలనాలు వరుసగా 25 వెలువడ్డాయి. వీటిపై కూకట్ల తిరుపతి రాసిన సమీక్షా వ్యాసాలు ‘జల్లె డ’ పుస్తకంగా వచ్చాయి. ఆ తర్వాత ఆర్థిక వనరుల కొరత వల్ల ఎన్నీల కవితా గాన సంకలనాలు ప్రతిమూడు నెల్లకొకటి, తర్వాత ఎడాదికి ఒకటి చొప్పున, ఇప్పటివరకు సుమారు 60 పుస్తకాలు ముద్రితమయ్యాయి.
తెరవే కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా కొనసాగిన గాజోజు నాగభూషణం, బూర్ల వెంకటేశ్వర్లు, కూకట్ల తిరుపతి, కందుకూరి అంజయ్య, సి.వి. ఎన్నీల ముచ్చట్లను సమన్వయం చేశారు. ఏ సాహితీవేత్త జయంతో, వర్ధంతో ఉంటే వాళ్ళను గుర్తు చేసుకుంటూ, వాళ్ళ చిత్రాలను ఆ నెలలో సంకలనాల ముఖచిత్రాలుగా వేసేవాళ్ళం.
ఎన్నీల ముచ్చట్లు జరిగే స్థల సమాచారాన్ని ముం దు రోజు దినపత్రికల్లో ప్రకటించడం వల్ల కార్యక్రమానికి విద్యార్థులు, యువతీ యువకులు, గృహిణిలు, సాహిత్యాభిమానులు, కొత్తవారు విరివిగా వచ్చేవారు. ఎన్నీల ముచ్చట్లు గుంపు మూడు తరాల కవుల కలయికగా కనిపిస్తుంది.
కొత్త తరానికి రచనా మెలకువలు తెలుపడానికి రెండుసార్లు కవిత్వ కార్యశాలలు, ఒక మారు కథారచన కార్యశాలను తెరవే నిర్వహించింది. సాహితీ శ్రష్టలతో కొత్త కవులు, రచయితలకు దిశానిర్దేశం చేయించారు. ఇందులో డా.నలిమెల భాస్కర్, ఎం.నారాయణశర్మ, చింతకింది కాసీం, సీతారాం, శిలాలోలిత, పెన్నా శివరామకృష్ణ, జూకంటి జగన్నాథం దెంచనాల శ్రీనివాస్, అల్లం రాజయ్య, శ్రీధర్‌రావు దేశ్ పాండే, తుమ్మేటి రఘోత్తమరెడ్డి, పెద్దింటి అశోక్ కుమార్ తదితరులతో శిక్షణ ఇప్పించారు.
ఎన్నీల ముచ్చట్లు ద్వారా వెలుగులోకి వచ్చి, పుస్తకాలు వేసిన వారిలో మహమ్మద్ నసీరుద్దీన్, తప్పెట ఓదయ్య, దామరకుంట శంకర య్య, సదాశ్రీ, తోట నిర్మలారాణి, రామానుజం సుజాత, పెనుగొండ బసవేశ్వర్, పెనుగొండ సరసి జ-, విలాసాగరం రవీందర్, మమత వేణు, మెరుగు ప్రవీణ్, సిరిపురం వాణిశ్రీ, సంగీతం శ్రీలేఖ, కనకం శ్రీనివాస్, డా.వాసాల వరప్రసాద్, మహ్మద్ ఖలిద్ తదితరులు ఉన్నారు. ఇప్పటివరకు జరిగిన ఎన్నీల ముచ్చట్లు 13వ వార్షికోత్సవాలలో లబ్ద ప్రతిష్టులు అతిథులుగా పాల్గొని కొత్త కవులకు మార్గదర్శనం చేశారు. కరీంనగర్ కవిత్వం అంటేనే ఉద్యమం, ఆందోళన, కదలిక, చలనం, అలజడి ఇత్యాదుల సమ్మేళనం. ఏనాడూ కరీంనగర్ కవిత్వం ఉద్యమాలకు ఎడంగా లేదు. ఆందోళనలకు జడంగా లేదు. మీదుమిక్కిలి అది కదలికలతో పెనవేసుకుని ఉంది. చైతన్యయుత చలనాలతో ముడివేసుకొని ఉంది. ఇక్కడి అక్షరం ప్రజల పక్షాన నిలబడుతున్నది. ఇక్కడి అక్షరం తెలంగాణ సాహితి వారసత్వంలోంచి అంది వచ్చిన ధిక్కారాన్ని ఎంచుకుంటున్నది.
కూకట్ల తిరుపతి