మన తెలంగాణ/హైదరాబాద్: పల్నాడు జిల్లాలో జంట హత్యల కలకలం రేగింది. దుర్గి మండలం అడిగొప్పలలో అన్న కొత్తా శ్రీరాంమూర్తి, తమ్ముడు కొత్తా హనుమంతు అనే ఇద్దరు అన్నదమ్ములను ప్రత్యర్థులు ఆదివారం రాత్రి వేటకొడవళ్లతో నరికి అత్యంత కిరాతకంగా హతమార్చారు. యాగంటి నరేష్ అనే వ్యక్తి గ్రామంలో హనుమంతుపై దాడి చేసి హత్య చేసినట్టుగా తెలుస్తుంది. అనంతరం నీలంపాటి అమ్మవారి గుడి దగ్గర వాట ర్ ప్లాంట్‌లో ఉన్న శ్రీరామ్మూర్తిపై కూడా కత్తులతో దాడి చేసి హతమార్చినట్టుగా తెలిసింది.
వ్యక్తిగత, కుటుంబపరమైన కారణాలతోనే ఈ హత్యలు జరిగాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతులిద్దరినీ టిడిపి సానుభూతిపరులుగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ జంట హత్యలపై పల్నాడు జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పందించారు. జిల్లా ఎస్‌పితో ఆయన మాట్లాడారు. నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్ట వద్దని ఆదేశిం చారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.