మన తెలంగాణ/బోడుప్పల్: మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. టిప్పర్ ఢీకొనడంతో ఎఎస్ఐ అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… అన్నోజిగూడకు చెందిన జగ్గాని రఘుపతి యాదవ్ (59) ఖైరతాబాద్ ఇంటెలిజెన్స్ ఎఎస్ఐగా పనిచేస్తున్నారు. సోమవారం తన విధులు ముగించుకొని తిరిగి ద్విచక్ర వాహనంపై వస్తుండగా ఉప్పల్ నుంచి వరంగల్ వెళ్లే హైవేపై నారపల్లి మసీదు దగ్గర వెనుక నుండి వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. దీంతో బైక్‌పై నుండి లారీ కింద పడటంతో అతడి తల మీద నుండి టైర్ పోయింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు టిప్పర్‌ను సీజ్ చేసి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.