కెసిఆర్‌పై మంత్రుల ముప్పెట దాడి
మీదే దద్దమ్మ ప్రభుత్వంః జూపల్లి
తోలు తీసే హక్కు ప్రజలదేః పొన్నం
మీ తోలు కుమార్తె కవిత తీస్తున్నారుః వాకిటి
మన తెలంగాణ/హైదరాబాద్‌ః సర్కారు తోలు తీస్తా అని వ్యాఖ్యానించిన బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుపై పలువురు మంత్రులు జూపల్లి కృష్ణా రావు, పొన్నం ప్రభాకర్, సీతక్క, వాకిటి శ్రీహరి, కాంగ్రెస్ నాయకులూ ముప్పెట దాటి చేశారు.
కెసిఆర్ ఆదివారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ నీటి పారుదల రంగంతో పాటు ప్రభుత్వంపై చురకలు వేస్తూ, ఈ ప్రభుత్వం తోలు తీస్తానని చేసిన వ్యాఖ్యలపై సోమవారం గాంధీ భవన్‌లో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావు మాట్లాడుతూ ‘మీదే దద్దమ్మ ప్రభుత్వం..’ అని కెసిఆర్‌నుద్ధేశించి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్‌ఎస్ మూడింట ఒక వంతు సీట్లు కూడా గెలుచుకోలేకపోయిందన్నారు. అసెంబ్లీ, లోక్‌సభ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలతో బిఆర్‌ఎస్ పార్టీ కండలు కరిగి తోలు మాత్రమే మిగిలిందని స్పష్టమవుతున్నదని ఆయన దుయ్యబట్టారు. బిఆర్‌ఎస్ బలహీనపడిందని, ప్రతిష్టా దిగజారిందని, కెటిఆర్, టి. హరీష్ రావులు పార్టీని కాపాడుకోలేకపోయారని ఆయన విమర్శించారు. పదేళ్ళలో ఏ ఒక్క ప్రాజెక్టూ పూర్తి చేయలేని దద్దమ్మ ప్రభుత్వం మీదని ఆయన ఘాటైన విమర్శ చేశారు. పదేళ్ళ పాలనలో ఉమ్మడి పాలమూరు జిల్లా సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేయలేని కెసిఆర్ ఉన్నట్లుండి ప్రేమ ఒలకబోస్తున్నారని మంత్రి జూపల్లి ధ్వజమెత్తారు. బిఆర్‌ఎస్‌కు తోలు తప్ప కండ లేదని ఆయన విమర్శించారు.
ఆ హక్కు ప్రజలకే ఉందిః పొన్నం
తోలు తీసే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రజలకు మాత్రమే ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో, అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రజలే మీ తోలు తీశారని ఆయన తెలిపారు. ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని తాము అనేక సార్లు కోరామని ఆయన చెప్పారు. ప్రతిపక్ష నాయకునిగా, ఉద్యమకారునిగా కెసిఆర్ అంటే తమకు గౌరవం ఉందన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తున్నామని, అందుకే ప్రజలు పంచాయతీ ఎన్నికల్లో తమకు పట్టం కట్టారని మంత్రి పొన్నం అన్నారు. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాయడాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఈ పన్నెండేళ్ళలో ఏమి అభివృద్ధి చేశారో తెలియజేస్తూ లేఖ రాయాలని సూచించారు.
నాయనా పులి వచ్చే: మంత్రి వాకిటి
‘ఇదిగో వస్తున్నా..’ అని కెసిఆర్ చెప్పడం చూస్తుంటే ‘నాయనా పులి వచ్చే..’ అనే కథలా ఉందని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. కేంద్రం చూపిస్తున్న వివక్ష గురించి కెసిఆర్ మాట్లాడుతారనుకున్నానని ఆయన తెలిపారు. కెసిఆర్ అసెంబ్లీకి వచ్చి బిఆర్‌ఎస్-కాంగ్రెస్ పాలనలో ఎవరి హయాంలో ఎంత అభివృద్ధి చెందిందో చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టుల కోసం భూసేకరణకు నిధులు ఇస్తున్నామని అన్నారు. అవగాహన లేకుండా సరైన సమాచారం లేకుండా మాట్లాడడం కెసిఆర్‌కు భావ్యం కాదని ఆయన తెలిపారు. కెసిఆర్ అధికారంలో ఉన్నప్పుడు పాలమూరు ప్రాజెక్టులకు నిధులు కేటాయించకుండా, భూసేకరణ చేయకుండా తప్పు మీద తప్పు చేసింది కెసిఆరేనని ఆయన విమర్శించారు. సర్కారు తోలు తీస్తాం అని కెసిఆర్ చేసిన వ్యాఖ్యను మంత్రి ప్రస్తావిస్తూ మీ తోలు మీ కుమార్తె కె. కవిత తీస్తున్నారు కదా అని అన్నారు. పచ్చకామెర్లు వచ్చిన వారికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని ఆయన విమర్శించారు.
అసెంబ్లీలో చర్చిద్దాం రండిః బల్మూరి
కెసిఆర్‌కు ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి బిఆర్‌ఎస్, తాము అధికారంలోకి వచ్చిన ఈ రండేళ్ళలో జరిగిన అభివృద్ధిపై చర్చించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు. మాజీ మంత్రి టి. హరీష్ రావుకు దమ్ముంటే తన సవాల్‌ను స్వీకరించి కెసిఆర్‌ను అసెంబ్లీకి తీసుకుని రావాలని ఆయన డిమాండ్ చేశారు. హరీష్ రావు ఏదైనా తెలుసుకుని మాట్లాడితే మంచిదన్నారు. బిఆర్‌ఎస్‌ను నడిపించడంలో కెటిఆర్, హరీష్ రావు దద్దమ్మలే కాబట్టి కెసిఆర్ బయటకు వస్తున్నారని ఆయన తెలిపారు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులను సరి చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన చేస్తున్నారని బల్మూరి వెంకట్ అన్నారు.
దోపిడిని ప్రజలు మరచిపోలేదుః చనగాని
బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన దోపిడిని ప్రజలు ఇంకా మరచిపోలేదని పిసిసి ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనతో ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆయన సోమవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో మరో పదేళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని ఆయన అన్నారు. ప్యూచర్ సిటి అభివృద్ధితో తెలంగాణ ముఖ చిత్రం మారిపోతుందని కెసిఆర్ తెలుసుకోవాలని ఆయన తెలిపారు. ప్రజా ప్రభుత్వానికి కెసిఆర్ ప్రతిపక్ష నేతగా సలహాలు, సూచనలు ఇస్తే ప్రజలు సంతోషిస్తారని చనగాని దయాకర్ అన్నారు.