ఎన్నికల వ్యవస్థకు బిఎల్‌ఓలే వెన్నెముక
వాళ్ల నిబద్ధతపైనే ఓటర్ల జాబితా సమగ్ర సవరణ విజయం ఆధారపడి ఉంది: సిఇసి
మనతెలంగాణ/హైదరాబాద్ : తదుపరి ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ – ఎస్‌ఐఆర్..సర్) తె లంగాణలోనే అని ప్రధాన ఎన్నికల కమిషనర్(సిఇసి) జ్ఞానేష్‌కుమార్ వెల్లడించారు. తెలంగాణలో ఎస్‌ఐఆర్‌ను విజయవంతంగా చేద్దామని బూత్ స్థాయి అధికారులను(బిఎల్‌ఒ)లకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో సగటున ఒక్కో బిఎల్‌ఒకు 930 మంది ఓటర్లు వస్తారని తెలిపారు. ఆదివారం రవీంద్రభారతిలో జరిగిన బూత్ స్థాయి అధికారుల సమావేశంలో సిఇసి జ్ఞానేష్‌కుమార్ మాట్లాడారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ విషయంలో తెలంగాణ త్వరలోనే దేశానికి మార్గదర్శకంగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు.
ఈ విషయంలో ఇటీవల బీహార్‌లో విజయవంతంగా పూర్తయిన ఎస్‌ఐఆర్ ప్రక్రియను ప్రమాణికాంగా తీసుకోవాలని పేర్కొన్నారు. భారత ఎన్నికల వ్యవస్థకు బిఎల్‌ఒలే వెన్నెముక అని, వారి నిబద్ధత, కృషిపైనే ఓటర్ల జాబితా సరవణ విజయం ఆధారపడి ఉంటుందని తెలిపారు. బీహార్‌ను ఉదాహరణగా ప్రస్తావిస్తూ, అక్కడ నిర్వహించిన భారీ ఎస్‌ఐఆర్ ప్రక్రియ ఎలాంటి లోపాలు లేకుండా పూర్తయిందని తెలిపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 7.5 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పారు. ఈ మొత్తం ప్రక్రియలో ఒక్క ఫిర్యాదు కూడా నమోదు కాకపోవడం, రీపోలింగ్, రీకౌంటింగ్ అవసరం లేకపోవడం విశేషమని పేర్కొన్నారు.
ఎన్నికల చట్టాలను అందరూ పాటించాల్సిందే
తెలంగాణ విస్తీర్ణం కెనడాకంటే పెద్దది అని సిఇసి జ్ఞానేష్ కుమార్ తెలిపారు. సమగ్ర ఓటర్ల జాబితా శుద్ధి పూర్తయిన తర్వాత రాష్ట్రంలో ఎన్నికల పరిపాలన ఒక కొత్త యుగంలోకి అడుగుపెడుతుందని అన్నారు. బిఎల్‌ఒలతో జరిగిన పరస్పర చర్చలో పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం తక్కువగా ఉండటానికి పట్టణ ఓటర్ల నిరాసక్తతే ప్రధాన కారణమని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల ఓటర్లు మాత్రం ఉత్సాహంగా క్యూల్లో నిలబడి ఓటు హక్కును వినియోగిస్తూ దేశానికి దారి చూపుతున్నారని వ్యాఖ్యానించారు. భారతదేశంలో ఎన్నికలు పూర్తిగా దేశ చట్టాల ప్రకారమే నిర్వహించబడుతున్నాయని, ఎన్నికల చట్టాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.
అలాగే 1995లో సభ్యదేశంగా చేరిన ఇంటర్నేషనల్ ఐడియాకు దాదాపు మూడు దశాబ్దాల తర్వాత భారత్‌కు ఛైర్మన్‌షిప్ లభించిందని తెలిపారు. ఇది భారత ఎన్నికల సంఘం ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయమైన, వినూత్న ఎన్నికల నిర్వహణ సంస్థగా గుర్తింపు పొందినదానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కీలక గణాంకాలను వివరించారు. ఈ సమావేశంలో అదనపు ప్రధాన ఎన్నికల అధికారి వాసం వెంకటేశ్వర రెడ్డి, జిహెచ్‌ఎంసి కమిషనర్ ఆర్.వి కర్ణన్, సీనియర్ డిప్యూటీ సిఇసి పవన్ కుమార్ శర్మ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.