మనతెలంగాణ/హైదరాబాద్ : అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ లెక్చరర్ల నియామకంలో కనీస అర్హత కోసం నిర్వహించే తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టిజిసెట్ 2025) పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని టిజిసెట్ కార్యాలయంలో ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి వైస్ ఛాన్స్‌లర్ కుమార్ మొలుగరం ఉదయం 8.30 గంటలకు పరీక్షల పాస్‌వర్డ్ విడుదల చేసి, రాష్ట్రవ్యాప్తంగా పరీక్ష ప్రక్రియను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఒయు రిజిస్ట్రార్ జి. నరేష్ రెడ్డి, ఓ.ఎస్.డి ఎస్. జితేంద్ర కుమార్ నాయక్, టిజిసెట్ మెంబర్ సెక్రటరీ బి. శ్రీనివాస్, కాకతీయ యూనివర్సిటీ విసి ప్రతాప్ రెడ్డి, తెలుగు యూనివర్సిటీ విసి నిత్యానంద రావు, పిజి అడ్మిషన్స్ డైరెక్టర్ ఐ. పాండురంగారెడ్డి, ఆడిట్ సెల్ డైరెక్టర్ ఎన్.కిషన్ సహా ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
పరీక్షల నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ, పారదర్శకతకు పెద్దపీట వేసిన టిజిసెట్ బృందాన్ని వైస్ ఛాన్సలర్ ఈ సందర్భంగా అభినందించారు. ఈ సందర్భంగా టిజిసెట్ మెంబర్ సెక్రటరీ బి. శ్రీనివాస్ మాట్లాడుతూ… సోమవారం నుంచి ఈ నెల 24 వరకు జరిగే టిజి సెట్ 2025 పరీక్షల్లో 45 వేల 127 మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు వెల్లడించారు. సాంకేతిక ఇబ్బందులు తలెత్తితే తక్షణమే పరిష్కరించేందుకు, ఎలాంటి అక్రమాలకు తావులేకుండా పూర్తి పారదర్శకంగా పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని స్పష్టం చేశారు.