నేనే రంగంలోకి దిగుతున్న
ఇయ్యాల్టి వరకు ఓ కథ.. రేపట్నుంచి మరో కథ
నదీ జలాల కోసం మరో ఉద్యమం
ఉమ్మడి పాలమూరుకు కృష్ణా జలాల్లో అప్పుడూ.. ఇప్పుడూ అన్యాయమే
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ద్రోహం చేస్తున్నాయి
174 టిఎంసిలు రావాల్సింది, 40 టిఎంసిలకే చాలంటారా?
డిపిఆర్‌ను వెనక్కి పంపితే మౌనం దాల్చుతారా?
పాలమూరు జిల్లాలో ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్లిచ్చాం
మూడు జిల్లాల్లో బహిరంగ సభలు పెడతాం
ఈ ప్రభుత్వానికి రియల్ ఎస్టేట్ దందా తప్పా మరో ధ్యాసలేదు
చెక్‌డ్యామ్‌లు పేల్చిన నిందితులు పాతాళంలో ఉన్నా పట్టుకొస్తాం
ఇది సర్వ భ్రష్ట ప్రభుత్వం
బిజెపి శనిలా దాపురించింది
చంద్రబాబు మాటలు విని ఇబ్బంది పెట్టింది
మీడియా సమావేశంలో నిప్పులు చెరిగిన బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రాష్ట్రాన్ని పాలించిన ప్రభుత్వాలు పాలమూరుకు ద్రోహం చేశాయని బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు. ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా మరోసారి అలాగే వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రభుత్వాన్ని ఎండగడుతూ పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో బహిరంగ సభలు పెడతామని వెల్లడించారు. గ్రామగ్రామాన ప్రజా ఉద్యమాలు చేస్తామని వెల్లడించారు. బహిరంగ సభలు పెడతామని, వాటికి తానే స్వయంగా హాజరవుతానని తెలిపారు. ప్రజాక్షేత్రంలో నిష్క్రియ ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు. ఇవాల్టి దాకా వేరు కథ.. రేపట్నుంచి వేరే.. తోలుతీస్తామని హెచ్చరించారు. రెండేళ్ల నుంచి మౌనంగా ఉన్నానని.. ఇక తప్పనిసరి పరిస్థితి అని బయల్దేరానని తెలిపారు.
అటు కేంద్రాన్ని, ఇటు రాష్ట్రాన్ని ఎండగడతానని పేర్కొన్నారు. రెండు మూడు రోజుల్లో ఆయా జిల్లా నాయకులతో సమావేశమై, కచ్చితంగా పెద్ద ఎత్తున గ్రామగ్రామాన సభలు పెడతామని తెలిపారు. కవులు, గాయకులను తట్టి లేపుతామని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని రక్షించుకోవాలని.. తమ కండ్ల ముందే ఇంత దుర్మార్గం జరుగుతుంటే కెసిఆర్ ఎందుకు మౌనంగా ఉండాలని ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం జరిగిన బిఆర్‌ఎస్‌ఎల్‌పి, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశంలో కెసిఆర్ పార్టీ నేతలకు పలు అంశాలపై దిశానిర్ధేశం చేశారు. అనంతరం బిఆర్‌ఎస్ ముఖ్యనేతలతో కలిసి కెసిఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బిఆర్‌ఎస్ కార్యవర్గ సమావేశంలో ప్రధాన ఎజెండా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు అంశంపైనే జరిగిందని తెలిపారు. కేంద్రం, రాష్ట్రం పాలమూరు ప్రాజెక్టుకు చేసిన ద్రోహంపైనే సమావేశంలో చర్చించామని వెల్లడించారు.
ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క అంటూ కాంగ్రెస్ సర్కార్‌కి తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు. పాలమూరు జిల్లాకు జరుగుతున్న అన్యాయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తెలంగాణకు ద్రోహం చేస్తున్నాయని.. తాము చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. రెండేళ్లు ఆగామని.. ఇకపై ప్రభుత్వాన్ని అడుగడునా నిలదీస్తామన్నారు. ఇకపై రాష్ట్రంలో ప్రజా ఉద్యమాలు చేపడతామని ప్రకటించారు. ఇంట్లోకి వచ్చి దోచుకుపోతామంటే ఊరుకుంటామా..? అని ప్రశ్నించారు. సమైక్య రాష్ట్రంలో ఎక్కువ అన్యాయానికి గురైన జిల్లా పాలమూరేనని, 174 టీఎంసీల నీరు పాలమూరు జిల్లాకు సంబంధించిన ప్రాజెక్టులకు రావాల్సి ఉందని కేసీఆర్ అన్నారు. పాలమూరు జిల్లాలో కృష్ణానది 300 కి.మీ ప్రవహిస్తోందని, ఉద్యమ సమయంలో పాలమూరుకు జరిగిన అన్యాయం వివరించానని తెలిపారు. బచావత్ ట్రైబ్యునల్ పంపకాల్లో పాలమూరు గురించి స్పష్టంగా చెప్పిందని, 1974లో బచావత్ ట్రైబ్యునల్ 17 టిఎంసిలు జూరాలకు సుమోటోగా కేటాయించిందని, కానీ, బచావత్ ట్రైబ్యునల్ కేటాయింపులను పట్టించుకున్నవారే లేరు అని పేర్కొన్నారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రాజెక్టుల పరిస్థితిపై పూర్తి అధ్యయనం చేశామని, పాలమూరు జిల్లాకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు. చంద్రబాబు పెండింగ్ పెట్టిన ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చామని అన్నారు. పాలమూరు జిల్లాలో ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్లిచ్చామని, భూ గర్బజలాల ద్వారా మరో లక్షన్నర ఎకరాల ఆయకట్టు వచ్చిందని వివరించారు. పాలమూరు జిల్లాకు 170 టిఎంసిలు తీసుకెళ్లాలన్నది బిఆర్‌ఎస్ సర్కారు వ్యూహం అని పేర్కొన్నారు. పాలమూరు జిల్లాలో చెరువుల లెక్కలు తీసి కేంద్రానికి సమర్పించామని, చంద్రబాబు మాటలు విని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెట్టిందని కెసిఆర్ ఆరోపించారు. బిజెపి ప్రభుత్వం మొదటి నుంచి తమకు శనిలా దాపురించిందని విమర్శించారు. ఎంత దద్దమ్మ ప్రభుత్వం అయినా పాత ప్రాజెక్టులను కొనసాగించాలి కదా..? అని ప్రశ్నించారు. రెండేళ్లయినా పాలమూరు ప్రాజెక్టులో తట్టెడు మట్టయినా తీయలేదని విమర్శించారు.
నా విమర్శలకు తట్టుకోలేకే చంద్రబాబు కర్ణాటకకు డబ్బు చెల్లించారు
పాలమూరు నుంచి ముంబయికి విస్తృతంగా వలసలు ఉండేవని, గోరటి వెంకన్న కూడా పాలమూరు వలసలపై పాట రాశారని కెసిఆర్ అన్నారు. సమైక్య రాష్ట్రంలోనే సమగ్రాభివృద్ధి పేరిట చంద్రబాబు సభలు పెట్టారన్నారు. జూరాల ప్రాజెక్టు కోసం పరిహారం డబ్బు చంద్రబాబు కట్టడం లేదని తన విమర్శలకు తట్టుకోలేక కర్ణాటకకు డబ్బు చెల్లించారని పేర్కొన్నారు.తాను ఉద్యమం మొదలుపెట్టాక తొలిసారి జోగులాంబ గద్వాల పాదయాత్ర చేశానని గుర్తు చేశారు. ఎంతో అధ్యయనం చేశాకే జోగులాంబ- గద్వాల పాదయాత్ర చేశామన్నారు. ఉద్యమం తర్వాత తెలంగాణ ఏర్పాటైందని, తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతం కాదు వెనుకకు నెట్టివేయబడ్డ రాష్ట్రమని పదే పదే చెప్పినట్లు గుర్తు చేశారు. ఆనాడు పాలమూరులో గంజి కేంద్రాలు పెట్టాల్సిన దుస్థితి వచ్చిందని, రాష్ట్రం వచ్చాక ప్రాజెక్టుల పరిస్థితిపై పూర్తి అధ్యయనం చేశామన్నారు. తమ హయాంలో పాలమూరు, నల్లగొండ జిల్లాలను అద్భుతంగా తీర్చిదిద్దామని వ్యాఖ్యానించారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు పడావు పెట్టారని ప్రశ్నించారు. ఇంకా ఎందుకు పూర్తి చేయలేదని.. ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని నిలదీశారు. కృష్ణా జలాల అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీ పడిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు ఆవేశంగా ఉన్నారని అన్నారు. ప్రతిపక్షంగా మన బాధ్యతను నిర్వహిద్దామని పార్టీ పిలుపునిచ్చారు.
తెలంగాణ నదీ జలాలకు బిఆర్‌ఎస్ మాత్రమే శ్రీరామరక్ష
తెలంగాణ తెచ్చిన పార్టీగా, ప్రధాన ప్రతిపక్షంగా తమపై రెండు బాధ్యతలు ఉన్నాయని కెసిఆర్ తెలిపారు. అడ్డం పొడువు మాట్లాడి, కారుకూతలు కూసి ఏదో చేస్తామంటే ఇక నడవదని అన్నారు. తొందరపడి ఏ పని చేయట్లేదని.. అక్కసుతో మాట్లాడట్లేదని తెలిపారు. అనేక రకాల సమస్యలపై బిఆర్‌ఎస్ పార్టీ పోరాడుతూనే ఉందని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు రాష్ట్రం మొత్తానికే ముప్పు వచ్చే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అటు గోదావరి మీద చంద్రబాబు దోపిడీ చేస్తుంటే దాని మీద చప్పుడు లేదు.. ఇటు కృష్ణాలో పాలమూరు ఎత్తిపోతల మీద ఘోరం జరుగుతుంటే దీనిపైనా చప్పుడు లేదు.. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎవరి ప్రయోజనాల కోసం ఉన్నట్లు..? అని ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందని నిలదీశారు. అందుకే ఈ పిరిస్థితుల్లో తానే స్వయంగా రంగంలోకి దిగాలని అనుకున్నానని పేర్కొన్నారు. తెలంగాణ నదీ జలాలకు బిఆర్‌ఎస్ మాత్రమే శ్రీరామరక్ష అని వ్యాఖ్యానించారు. తెలంగాణపై ఆర్తి బిఆర్‌ఎస్‌కు మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు మరో ఉద్యమం చేపడదామని పిలుపునిచ్చారు.
ఎంతసేపు రియల్ ఎస్టేట్ దందాలే తప్ప.. వేరే ధ్యాసే లేదు
ఎంతసేపు రియల్ ఎస్టేట్ దందాలే తప్ప.. వేరే ధ్యాసే లేదని కెసిఆర్ కాంగ్రెస్ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. సర్కార్ విధానాలను ఎక్కడికక్కడ నిలదీస్తామని.. అన్యాయాలపై ప్రశ్నిస్తామని అన్నారు. ఎంత సేపూ భూములు అమ్ముకుందామనే యావలోనే ఉంటే ఎలా….? అని ప్రశ్నించారు. రాష్ట్రానికి వచ్చే నీళ్లను కూడా కాపాడలేని ఇదేమి దద్దమ్మ ప్రభుత్వం అని..? అని నిలదీశారు. కేవలం 40 టిఎంసిలు చాలని కేంద్రానికి ఎలా లేఖ రాస్తారని అడిగారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ప్రజల మధ్య ఎండగడతామని ప్రకటించారు. రాష్ట్రంలో రైతులు పండించిన వడ్లు కొనే దిక్కు లేదు.. యూరియా ఇచ్చే సిస్టమ్ లేదని రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఆగమాగం చేస్తుందన్నారు. వీరి పాలనా విధానాలు గమనిస్తుంటే.. అసలు తెలంగాణలో ప్రభుత్వం ఉందా…నిద్రపోతుందా..? అనే అనుమానం కలుగుతోందని పేర్కొన్నారు. ఎంతసేపు భూములు అమ్ముకుందామనే యావలోనే ఉంటే ఎలా..? అని ప్రశ్నించారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే.. ప్రభుత్వం నోరుమూసుకుని ఉంటుందని.. అందుకే తాము ముందడుగు వేస్తామని అన్నారు.
ఫ్యూచర్ సిటీ పేరుతో జరిగేదంతా రియల్‌ఎస్టేట్ దందానే
రాష్ట్రంలో రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫార్మా సిటీ.. ఫ్యూచర్ సిటీ అంతా ఉత్తిదే అని కెసిఆర్ విమర్శించారు. ఫ్యూచర్ సిటీ పేరుతో జరిగేదంతా రియల్ ఎస్టేట్ దందానే అని ఆరోపించారు. ఫ్యూచర్ సిటీ..తొక్క సిటీ.ఎవరికి కావాలి నీ ఫ్యూచర్ సిటీ అంటూ సిఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. హైదరాబాద్ సిటీని రేవంత్‌రెడ్డి పెంచారా..? అని నిలదీశారు. 400 సంవత్సరాల చరిత్ర వల్ల క్రమంగా హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందిందని, అలా అన్ని సిటీలు అయిపోవు అని పేర్కొన్నారు. అన్నీ దిక్కుమాలిన పాలీసీలు, రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అక్రమంగా ల్యాండ్ పూలింగ్‌పై బిఆర్‌ఎస్ పార్టీ హైకోర్టులో కేసు వేస్తే ప్రభుత్వం అంతా సవ్యవంగానే చేస్తున్నామని చెప్పిందని అన్నారు. జూ పార్క్ తీసుకపోయి ఫ్యూచర్ సిటీలో పెడుతాడట అంటూ విమర్శించారు. తాము ఇలాంటి పనులు చేయలేదు అని, ఏం చేయదలచుకున్నా రాష్ట్రాన్ని అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తాము ఇలాంటి చిల్లరపనులు చేయలేదని తెలిపారు.
బిజినెస్ మీటింగ్‌లకు ఆద్యుడు చంద్రబాబని, ఆయన మొదటిసారి సిఎం అయినప్పుడు విశాఖలో బిజినెస్ మీటింగ్ పెట్టారన్నారు. అప్పట్లో విశాఖ ఎంఒయుల్లో వంట మనుషులు సంతకాలు పెట్టారు, అవన్నీ నిజమైతే లక్షల కోట్ల పెట్టుబడులు రావాలి కదా..? ప్రశ్నించారు.తాము బిజినెస్ మీటింగ్‌లు పెట్టలేదని, మంచి పాలసీలతోనే పెట్టుబడుదారుల్నీ ఆకర్షించినట్లు తెలిపారు. గతంలో ఫాక్స్‌కాన్ కంపెనీ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తే రూ.3,000 కోట్లు ఎదురు ఇస్తామని మహారాష్ట్ర తీసుకుపోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇస్తామన్న రూ.2500 ఇవ్వలేదని ఇక కోటీశ్వరులను ఎలా చేస్తారు..? అని ప్రశ్నించారు. తాము భూముల ధరలు పెంచగలిగామని నాలుగు ఎకరాలు ఉన్నవాడు ధీమాగా ఉండేవాడని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో భూముల ధరలు కుప్పుకూలాయని, రైతులను, ఉద్యోగులను అందరినీ ఏడిపిస్తున్నారని ధ్వజమెత్తారు. అప్పులు కట్టలేకపోతున్నామని అంటే కాగ్ చెంపలు వాయించిందని గుర్తుచేశారు. ఎక్కడ మాట్లాడినా కెసిఆర్ చచ్చిపోవాలనే మాట్లాడతారా..? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడో కోపం వస్తే ఒక మాట అనొచ్చు కానీ ప్రతిసారీ తనపైనే శాపనార్థాలు పెడతారా..? అని ఆక్షేపించారు. గురుకుల పాఠశాల విద్యార్థులు చనిపోయారని, ఇప్పటికి 125 మంది చనిపోయారు. గట్టి అధికారిని పెట్టి గట్టి చర్యలు తీసుకోలేరా..అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బస్తీ దవాఖానాలను కూడా ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది
కాంగ్రెస్ సర్కార్ బస్తీ దవాఖానాలను కూడా నిర్వీర్యం చేస్తోందని కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కెసిఆర్ కిట్ పథకాన్ని కూడా ఎందుకు నిలిపివేసిందని ప్రశ్నించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకువచ్చిన ఆరోగ్యశ్రీని అసెంబ్లీ వేదికగా ప్రశంసించామని గుర్తుచేశారు. ఆరోగ్యశ్రీ మొత్తాన్ని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచానని తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తోంది..? అని ప్రశ్నించారు. కెసిఆర్ కిట్ పథకాన్ని కూడా కాంగ్రెస్ సర్కార్ ఎందుకు నిలిపివేసిందని నిలదీశారు. కాంగ్రెస్ రైతులను రాచి రంపాన పెడుతోందని మండిపడ్డారు. రైతులకు నీళ్లు ఇచ్చే చెక్ డ్యామ్‌లను పేల్చివేయడం దారుణమని వాపోయారు. తాము అధికారంలోకి వచ్చాక కూల్చినవాళ్లు పాతాళంలో ఉన్నా పట్టుకువస్తామని కెసిఆర్ హెచ్చరించారు.