అమృత ద్వీపం
అమ్మ ఉమ్మనీటి గర్భాలయం
రక్తపు గోడల కావలి కవచం నీకది
అడుగుబయట పడిందో నీ రక్షణభారం నీదే
తాతని, అన్నని అంటూనే
నీ బుజాల కింద విషపు రాపిడితో
కాటేస్తాయి మదమృగాలు
చిన్నప్పటి నుంచే
నీ గోళ్ళు గుచ్చే సులాలుగా పెంచు
నీ పలువరుసను కాముకుడి కుత్తుకను చీల్చే
కత్తులుగా సానపెట్టు
ఏ బంధానికి లొంగకు
ఏ ఆకర్షణ వలలో చిక్కుబడిపోకు
బొట్టుబిళ్ళలకో, స్వీటు డబ్బాకో
సెల్‌ఫోన్‌కో ఆశపడకు
తోటలోకో, పొదమాటుకో రమ్మంటే
బలిపశువులా వెంట వెళ్ళకు
పేదరికాన్ని చదువుతో జయించు
పెనుముప్పును జ్ఞానంతో ఎదురించు
దుర్మార్గపు లోకమిది
వావివరుసలు లేని తుచ్చుల కాలమిది
అధికారాలు ఆర్భాటాలు, సంఘాలు,
ధర్నాలు ఏవి నిన్ను కాపాడలేవు
నీ దేహం నీది హక్కులన్నీ నీవే
కాళ్ళు, చేతుల్లాంటివే నీ రహస్య అంగాలు
దుష్టనీడ పడకుండా నిన్ను నువ్వు కాచుకో
మానం, అవమానం కన్నా ప్రాణం మిన్న
చిన్నారి, నీ జీవితంరా ఇది
మల్లెపువ్వులాగా మంచి గంధంలాగా
నిండుపున్నమిలో పిల్ల తెమ్మెరలాగా
సాగాలి తల్లీ నీ పయనం
జలతారు వెన్నెలలాగా
భద్రం భద్రం చిట్టితల్లి
రోహిణి వంజారి