2023 ప్రపంచకప్ ఫైనల్‌ని ఏ భారత క్రికెట్ అభిమాని కూడా మర్చిపోలేడు. టోర్నమెంట్ మొత్తం ఓటమి లేకుండా ఫైనల్స్‌కి దూసుకెళ్లిన భారత్.. ఫైనల్స్‌లో ఆసీస్ చేతిలో ఓటమిని చవిచూసింది. ప్రపంచకప్‌ను ఆఖరి మెట్టుపై చేజార్చుకుంది. ఈ ఓటమి ఎందరో క్రికెట్ అబిమానుల మనస్సును విరిచేసింది. ఆ బాధ నుంచి తేరుకోవడానికి చాలా కాలమే పట్టింది. సగటు అభిమానికే కాదు.. అప్పుడు కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ కూడా ఆ మ్యాచ్ తర్వాత చాలా కుంగిపోయాడట. ఈ విషయాన్ని తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో రోహిత్ గుర్తు చేసుకున్నాడు.
‘‘అందరిలా నేను ఏం జరిగిందో నమ్మలేకపోయాను. అది వ్యక్తిగతంగా నాకు చాలా కఠినమైన సమయం. ఆ ఫైనల్ ఓటమి తర్వాత చాలా కుంగిపోయాను. ఇకపై క్రికెట్ ఆడకూడదని అనుకున్నాను. ఎందుకంటే ఆ టోర్నమెంట్ కోసం ఎంత కష్టపడ్డాడు. ఏదో రెండు, మూడు నెలల నుంచి కాదు. 2022లో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రపంచకప్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. అది సాధ్యం కాకపోవడంతో నేను పూర్తిగా కుంగిపోయాను. నా శరీరంలో ఎలాంటి శక్తి మిగిలలేదు. కోలుకొని సాధారణ స్థితి రావడానికి రెండు నెలల సమయం పట్టింది. నాకు నేను ధైర్యం చెప్పుకొని నెమ్మదిగా బాధ నుంచి బయటకు వచ్చాను. మరోసారి లక్ష్యం దిశగా అడుగులు వేయాలని నిర్ణయించుకున్నా. ఆ పట్టుదలే 2024 టి-20 ప్రపంచకప్ విజేతగా మమ్మల్ని నిలబెట్టింది’’ అని రోహిత్ తన అనుభవాన్ని పంచుకున్నాడు.