హైదరాబాద్: పాలమూరు-ఎస్‌ఎల్‌బిసిని బిఆర్ఎస్ పూర్తి చేస్తుంటే ఎవరైనా అడ్డుకున్నారా..? అని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రశ్నించారు. కమీషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి లక్షల కోట్లు అప్పులు చేశారని మండిపడ్డారు. బిఆర్ఎస్ చేసిన అప్పులకు వడ్డీల కింద ఏటా రూ.16 వేల కోట్లు చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. పాలమూరు-రంగారెడ్డికి సంబంధించి తాను రాసిన లేఖలో 90 టిఎంసిలు అని స్పష్టంగా ఉందని తెలిపారు. పాలమూరు-రంగారెడ్డికి పర్యావరణ అనుమతులు పూర్తిగా రాలేదని అన్నారు. ప్రాజెక్టు పూర్తి చేయకుండా పాలమూరు ప్రజలకు బిఆర్ఎస్ అన్యాయం చేసిందని.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ.5 వేల కోట్ల పెండింగ్ బిల్లులు పెట్టారని తెలిపారు.
కెసిఆర్ డిజైన్ చేసి, నిర్మించిన కాళేశ్వరం వారి హయాంలోనే కూలిందని ఉత్తమ్ ఎద్దేవా చేశారు. మేడిగడ్డ గురించి మాట్లాడటం ఆపి.. సిగ్గుతో తలదించుకోవాలని విమర్శించారు. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులతోనే రాష్ట్రంలో సాగునీరు అందుతోందని తెలిపారు. బిఆర్ఎస్ హయాంలో ఐదేళ్లలో వాడుకున్న నీరు 70, 80 టిఎంసిలు మాత్రమే అని.. రూ.1.80 లక్షల కోట్ల ప్రాజెక్టు నిరుపయోగం కావడం బిఆర్ఎస్ ఘనత అని అన్నారు. ఎపికి 512, తెలంగాణకు 299 టిఎంసిలు అనేది పదేళ్లకు అంగీకరించారని ఆరోపించారు.