రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో నటించిన సూపర్ హిట్ మూవీ ఫ్రాంచైజీ ‘కాంచన’. ‘ముని’ సినిమాతో మొదలైన ఈ హారర్ మూవీ సిరీస్.. ఇప్పటికే నాలుగు సినిమాలు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ‘కాంచన-4’ని తెరకెక్కించే పనిలో పడ్డారు లారెన్స్. అయితే ఈ సినిమాకి సంబంధించి ఓ అప్‌డేట్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో కొత్త బ్యూటీ మీరా రాజ్ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ మూవీలో పూజా హెగ్డే, లారెన్స్, నోరా ఫతేహీ లాంటి స్టార్ నటీనటులతో నటించే అవకాశం కొట్టేసింది మీరా.
ఉత్తరాది నుంచి వచ్చిన అమ్మాయి అయినా.. మీరా తన తొలి చిత్రం ‘సన్ ఆఫ్’తో వెండితెరకు పరిచయం కానుంది. తొలి సినిమాకే ఆమె తన నటనతో అందరినీ మెప్పించింది. అంతేకాక.. తెలుగు నేర్చుకొని మరీ ఈ సినిమా కోసం స్పష్టమైన తెలుగు ఉచ్ఛారణతో డబ్బింగ్ చెప్పింది. దీంతో ఆమె డెడికేషన్‌కి అందరూ హాట్సాఫ్ అంటున్నారు. ఇప్పుడు ‘కాంచన-4’లో నటించే ఛాన్స్ కొట్టేసింది ఈ భామ. ఇందుకోసం తమిళం కూడా నేర్చుకుంటోందని తెలుస్తోంది.
అయితే ఈ ప్రాజెక్టులో తనకు అవకాశం ఇచ్చిన దర్శకుడు, హీరో రాఘవ లారెన్స్‌పై తనకు అపారమైన గౌరవం ఉందని మీరా భావోద్వేగంతో చెప్పింది. ‘‘నా మీద నమ్మకం ఉంచి ఈ పాత్రను ఇచ్చినందుకు లారెన్స్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఆయన నుంచి నాకు ఎప్పుడూ పూర్తి సపోర్ట్ లభిస్తోంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు నా శక్తినంతా పెట్టి పని చేస్తాను’’ అని మీరా పేర్కొంది. మొత్తానికి కాంచన-4 లాంటి పాన్ ఇండియా చిత్రంలో మీరాను ఎంపిక చేసినందుకు లారెన్స్ సెలక్షన్ సూపర్ అని ఫ్యాన్స్ అంటున్నారు.