అపురూప జ్ఞాపకాల మధురమైన తేనె
కడుపు ఆకలిని కనిపెట్టె బువ్వకుండ
పిల్లల రాక కోసం గూడు ముందు నిలబడి
ఎదురుచూసే ప్రేమ పక్షి కళ్ళు
కన్నపేగు తలపోతలో
తడిసిపోయే అపురూప దేవత
తన నెత్తురు ధారపోసి ఊపిరి పోసిన
అమ్మ పద్యం రాయడానికి అక్షరాలు దొరకట్లేదు
ధ్వనులు మూగబోయి దుఃఖ నదులవుతున్నయి
మనసు మౌనంగా లోలోపల
ఆకులు రాల్చుకుంటుంది
తల్లిలేని పక్షుల మౌనంలోఎడతెగని ముసురు
గూడు విడిచిన పక్షి యాదిలో
ఇల్లంతా చిత్తడి చిత్తడియి
దిగులు బుగులయి చూస్తున్న
దిక్కులు చిగుర్లు తినుకుంటూ
పిట్ట పిల్లల ఆటపాటలు చూస్తూ
ఇంకొన్నాళ్ళు ఉంటే ఎంత బాగుండునో
కనికరం లేని కాలానికి కంటగింపయిందేమో
బతుకు కొండెక్కిన ఇంటిలో
ఇప్పుడు అమ్మ పటం ముందు
వెలుగుతున్న ఒక దీపం ఆరిపోనీయకండి
కోడం కుమారస్వామి