రేపు మంత్రులతో ముఖ్యమంత్రి సమాలోచనలు
పరిషత్, మున్సిపల్ ఎన్నికలు, బిసి రిజర్వేషన్లపై సభలో చర్చ
ఏడు ఆర్డినెన్స్‌ల స్థానంలో బిల్లులు ప్రవేశపెట్టే యోచన
సహకార ఎన్నికలపైనా ప్రకటన వెలువడే అవకాశం
మన తెలంగాణ/హైదరాబాద్: అసెంబ్లీ శీతాకాల సమావేశాలను ఈ నెల 29 నుంచి ప్రారంభించేలా రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోన్నట్టు తెలిసింది. ఈ అంశంపై ఈ నెల 22న మంత్రులతో సమావేశమై సీఎం రేవంత్‌రెడ్డి చర్చించాక తేదీలను ఖరారు చేయనున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ సర్పంచ్‌లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడంతో అదే ఊపుతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి భావిస్తోన్నటు ్టఈ వర్గాల సమాచారం. పైగా అసెంబ్లీ సమావేశాలను ఎలాగు ఆరు నెలలలోపు నిర్వహించాల్సి ఉంది. ఈ మేరకు శీతాకాల సమావేశాలను ఏర్పాటు చేసినట్టు అవుతుంది, అలాగే బిసి రిజర్వేషన్లపై చర్చించాకే ఎన్నికలకు వెళ్లినట్టు ఉంటుందని సీఎం భావిస్తున్నట్టు తెలిసింది. స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లపై ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారన్న అపవాదు ప్రభుత్వం పై పడకుండా వీటిపై విపక్షాల అభిప్రాయాన్ని కూడా తీసుకున్నట్టు అవుతుందని భావిస్తున్నట్టు తెలిసింది. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లతో పాటు ఇదే సమావేశాలలో ఏడు ఆర్డినెన్స్‌ల స్థానే బిల్లులు ప్రతిపాదించవచ్చని సమాచారం. ఈ విషయాలన్ని కూడా 22న మంత్రివర్గ సహచరులతో చర్చించనున్నారని చెబుతున్నారు.
రిజర్వేషన్లను పెంచాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు, సుప్రీంకోర్టు రెండూ తిరస్కరించడంతో ఇక పార్టీ పరంగా రిజర్వేషన్లను కల్పించడమా? లేక మరేదైనా ప్రత్యామ్నాయం ఉందా? అనే అంశంపై కూడా సభలో చర్చకు పెట్టనున్నట్టు తెలిసింది. ఈ అంశంపై ఏ విధంగా ముందు కెళదామని విపక్షాల అభిప్రాయాన్ని కూడా ప్రభుత్వం తీసుకుంటే విమర్శలకు ఆస్కారం ఉండదని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది.
కాగా, గత అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత మొత్తం ఏడు ఆర్డినెన్స్‌లను తేగా అందులో రెండు జిహెచ్‌ఎంసి చట్ట సవరణలు. అలాగే మున్సిపాలిటీల చట్ట సవరణ, ప్రభుత్వ ఉద్యోగుల నియామకం. వేతనాల చట్ట సవరణ. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించిన సవరణ బిల్లు, తెలంగాణ గూడ్స్ అండ్ సర్వీసెస్ బిల్లు, ప్రైవేట్ యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లులను అసెంబ్లీలో చర్చించి ఆమోదించనున్నారు. ప్రభుత్వం తాజాగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల పాలక మండళ్లను రద్దు చేసిన నేపథ్యంలో ఈ ఎన్నికలపై కూడా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం.