మన తెలంగాణ / హైదరాబాద్ : సికిందరాబాద్, బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆదివారం ఎట్ హోం కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయతో పాటు బిసి కమిషన్ చైర్మన్ జి. నిరంజన్ పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అతిథులతో ఆత్మీయంగా మాట్లాడారు. కార్యక్రమం స్నేహపూర్వక వాతావరణంలో సాగింది.