18 మంది ఎంఎల్‌ఎలపై సిఎం రేవంత్ ఆగ్రహం
గెలుపు గుర్రాలను కాదని సర్పంచ్ అభ్యర్థులుగా బంధుమిత్రులను బరిలోకి దింపుతారా?
రెబెల్స్‌ను బుజ్జగించడంలో విఫలమయ్యారు
జిల్లా మంత్రులు, ఇన్‌చార్జీ మంత్రులను ఎందుకు సంప్రదించలేదు?
భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతమైతే ఊరుకునేది లేదు.. ముఖ్యమంత్రి హెచ్చరిక
నల్లగొండ, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల్లోని ఎంఎల్‌ఎలపై సిఎం సహా
పార్టీ ఇన్‌చార్జీ మీనాక్షి నటరాజన్, పిసిసి చీఫ్ మహేశ్ గౌడ్ అసహనం
మన తెలంగాణ/హైదరాబాద్‌ః “మీ నిర్వాకం వల్లే సగం సీట్లు కోల్పోయాం.. లేకపోతే వందకు తొంబై శాతం గ్రామ పంచాయతీ సీట్లను కైవసం చేసుకునేవాళ్ళం.. సర్పంచ్‌లుగా బంధు, మిత్రులను పోటీకి దించుతారా?.. తిరుగుబాటు అభ్యర్థులను బుజ్జగించి పోటీ నుంచి విరమింపజేయడంలో విఫలమయ్యారు.. ఇలాంటివి భవిష్యత్తులో పునరావృత్తమైతే ఊరుకోను” అని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి 18 మంది ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌తో, పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్‌తో పంచాయతీ ఎన్నికల ఫలితాలపై టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.
ఈ కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గాల వారీగా ఫలితాల చిట్టాను దగ్గర పెట్టుకుని యాభై శాతానికి తక్కువ స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందిన ఎమ్మెల్యేల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కువగా నల్లగొండ, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాల్లోని పార్టీ ఎమ్మెల్యేలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. ఎమ్మెల్యేలపై ఎంతో నమ్మకం పెట్టుకుంటే, పుట్టి ముంచారని ఆయన అన్నారు. పార్టీ అభ్యర్థులు నిలబడిన తర్వాత అక్కడే తిరుగుబాటు (రెబెల్స్) అభ్యర్థులు పోటీ చేస్తే మన ఎమ్మెల్యేలు నిలువరించలేకపోయారని ఆయన ఆగ్రహంగా అన్నారని తెలిసింది. కొంత మంది ఎమ్మెల్యేలు పట్టుబట్టి బంధు, మిత్రులను పోటీకి దించడంతో, వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు అభ్యర్థులు పోటీ చేశారని అందుకే భారీ నష్టం వాటిల్లిందన్నారు.
అంతేకాకుండా రెబెల్స్‌ను పోటీ నుంచి ఎందుకు తప్పించలేకపోయారని ఆయన ప్రశ్నించారు. వారిని వద్దని ఎందుకు వారించలేకపోయారు?, వారిని పోటీ నుంచి తప్పించే విషయంలో జిల్లా మంత్రికో, ఇన్‌ఛార్జి మంత్రికో చెప్పి వారిని పోటీ నుంచి తప్పించేందుకు ఎమ్మెల్యేలు చేసిన ప్రయత్నం ఏమిటో తనకు తెలియజేయాల్సిందిగా ఆ ఎమ్మెల్యేలకు చెప్పాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్‌తో అన్నట్లు తెలిసింది. బరిలో నుంచి తిరుగుబాటు అభ్యర్థులను తప్పించి ఉంటే మరో ఇరవై, ముప్పై శాతం సీట్లు పెరిగేవని ఆయన అన్నట్లు సమాచారం. ఏదైనా ఎమ్మెల్యేల నిర్వాకం వల్ల పార్టీకి నష్టం వాటిల్లిందని ఆయన కోపంగా అన్నారని పార్టీ వర్గాల సమాచారం. మున్ముందు జాగ్రత్తగా ఉండాలని, పునరావృతమైతే తాను ఊరుకోనని చెప్పాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నట్లు తెలిసింది.
ఎమ్మెల్యేలకు పిసిసి చీఫ్ ఫోన్
పట్టున్న చోట కోల్పోయాం..
ఇదిలాఉండగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆ ఎమ్మెల్యేలకు స్వయంగా ఫోన్ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తం చేసిన ఆగ్రహం గురించి చెప్పారు. అంతేకాకుండా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా అసహనం వ్యక్తం చేశారని తెలిపారు. పార్టీకి మంచి పట్టు ఉన్న చోట్ల తిరుగుబాటు అభ్యర్థుల వల్ల అనేక స్థానాలు కోల్పోయామన్నారు. ఫలితంగా అరవై శాతం సీట్ల వద్దే నిలిచిపోయామని, లేకపోతే తొంబై శాతం సర్పంచ్ స్థానాల్లో విజయం సాధించి ఉండేవారిమని ఆయన అన్నారు. 31 జిల్లాల్లో 12,733 స్థానాలకు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 7,010 స్థానాలను కైవసం చేసుకుందన్నారు. బిఆర్‌ఎస్ 3,502 గెలుపొందగా, బిజెపి 688 సర్పంచ్ స్థానాలను గెలుపొందినట్లు ఆయన చెప్పారు. తిరుగుబాటు అభ్యర్థుల వల్ల్ల ఇండిపెండెంట్లకు, ఇతర పార్టీలకు లాభం అయినట్లు స్పష్టంగా లెక్కలు చెబుతున్నాయని ఆయన చెప్పారు.
ముఖ్యంగా నల్లగొండ, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కొంత మంది ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నారని సమాచారం. తిరుగుబాటు అభ్యర్థులను సమన్వయపరచుకోవడంలో కొంత మంది ఎమ్మెల్యేలు విఫలమయ్యారని మీనాక్షి నటరాజన్ అసహనం వ్యక్తం చేశారని మహేష్ కుమార్ గౌడ్ వారికి గట్టిగా చెప్పారు. భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండాలని, ఇప్పుడు గ్రామ పంచాయతీలో బలంగా ఉంటేనే రాబోయే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో విజయానికి సులభం అవుతుందన్న విషయాన్ని గమనించాలని సూచించారు. త్వరలో జరగబోయే ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికలప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని లేకపోతే పార్టీకి భారీ నష్టం వాటిల్లుతుందని ఆయన హెచ్చరించారు. ఫలితంగా పార్టీకి నష్టం వాటిల్లుతుందని, అంతేకాకుండా పార్టీ అధిష్టానం నుంచి కూడా చివాట్లు తినాల్సి వస్తుందన్న విషయాన్ని మరిచిపోరాదని మీనాక్షి మీకు చెప్పమన్నారని మహేష్ కుమార్ గౌడ్ గట్టిగా చెప్పారని పార్టీ వర్గాల సమాచారం.
రైతులకు యూరియా సరఫరా చేసే విషయంలో ప్రభుత్వం కొత్తగా తీసుకువస్తున్న మొబైల్ అప్లికేషన్ విధానాన్ని కెటిఆర్ తీవ్రంగా వ్యతిరేకించారు. రైతుల అవసరాలకు తగ్గట్లుగా యూరియా సంచులను సరఫరా చేయలేక, ఇప్పుడు మొబైల్ యాప్ ద్వారా ఇస్తామని రైతులను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఒకప్పుడు నేరుగా దుకాణాల వద్దకే వెళ్లిన రైతులకు ఎరువులు అందించలేని ఈ చేతగాని ప్రభుత్వం, ఇప్పుడు యాప్ ద్వారా ఇస్తామంటే ఎవరూ నమ్మరని ఎద్దేవా చేశారు. ఎరువుల కోసం రైతులు పడుతున్న కష్టాలు, వారి లైన్లు బయటి ప్రపంచానికి కనిపించకుండా దాచిపెట్టేందుకే ఈ మొబైల్ యాప్ నాటకాన్ని కాంగ్రెస్ మొదలుపెట్టిందని ఆరోపించారు. కెసిఆర్ ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల పాటు ఎరువుల కోసం రైతులు ఎప్పుడూ క్యూ లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి లేదని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీస ప్రణాళికా జ్ఞానం లేకపోవడం వల్లనే నేడు రాష్ట్రంలో యూరియా కష్టాలు మొదలయ్యాయని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం లైన్లను దాచే ప్రయత్నాలు పక్కనబెట్టి, అసలు సమస్యపై దృష్టి సారించాలని హితవు పలికారు. రైతన్నలకు తక్షణమే అవసరమైన మేర యూరియాను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు రాజ్యాంగం కల్పించిన అధికారాలను ఎవరూ హరించలేరని, గ్రామాల్లో సర్పంచులే అసలైన కథానాయకులని కెటిఆర్ పేర్కొన్నారు.