జోహెనెస్‌బర్గ్ : దక్షిణాఫ్రికాలోని బెక్కెర్స్‌డల్ పట్టణంలో ఓ పబ్ వద్ద రక్తపాతం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున కొందరు సాయుధులు జరిపిన విచక్షణారహిత కాల్పుల్లో తొమ్మండుగురు మృతి చెందారు. కనీసం పది మంది వరకూ గాయపడ్డారు . మృతుల్లో ముగ్గురు బాలలు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని అధికార వర్గాలు ఆదివారం మధ్యాహ్నం వెల్లడించాయి. జోహెన్స్‌బర్గ్‌కు దాదాపు 46 కిలోమీటర్ల దూరంలో అర్థరాత్రి తరువాత కోలాహలంగా ఉన్న పబ్ ఒక్కసారిగా తెల్లటి మిని బస్సులో, సిల్వర్ సెడాన్ వాహనంలో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తుల దాడితో హాహాకారాలతో దద్దరిల్లింది. వస్తూనే వారు ముందుగా పబ్ నిర్వాహకులను ఎంచుకుని కాల్పులకు దిగారు. తరువాత కూడా పబ్‌కు వచ్చిన వారిపై వారి కాల్పులు సాగాయి. ఈ క్రమంలో తూటాలకు బలి అయ్యి చనిపోయిన వారి సంఖ్య తొమ్మిదిగా నిర్థారణ అయింది.
టాంబో సెక్షన్‌లోని క్వానాకోలో టావెర్న్ వద్ద ఈ పబ్ నెలకొని ఉంది. కాల్పులకు దిగి అక్కడి నుంచి దుండగులు వెంటనే తమ వాహనాలలో అక్కడి నుంచి పారిపోయారు. వీరు వెళ్లుతూ వెళ్లుతూ పట్టణంలో జనంపై కూడా కాల్పులకు దిగినట్లు తెలిసింది. దుండగుల ఆచూకి కోసం గాలిస్తున్నట్లు ప్రాంతీయ పోలీసు కమిషనర్ మేజర్ జనరల్ ఫ్రెడ్ కెకనా మీడియాకు తెలిపారు. మృతులలో ఒకరు పబ్ వెలుపల ఉన్న టాక్సీ కారు డ్రైవర్ అని వివరించారు. ఇటీవలి కాలంలో పలు ప్రాంతాలలో అర్థరాత్రి వరకూ సాగే పబ్‌లు, బార్లను ఎంచుకుని సాయుధులు దాడులకు దిగుతున్న ఘటనలు జరుగుతున్నాయి. ఇక్కడి పబ్‌లో జరిగిన దారుణకాండకు కారణంఏమిటనేది ఆరా తీస్తున్నారు. దుండగులను పట్టుకుంటేనే సంబందిత ధటనపై కొంత సమాచారం నిర్థారించుకునేందుకు వీలు అవుతుందని అధికారులు తెలిపారు.