మధ్యాహ్నం 2 గంటలకు బిఆర్‌ఎస్‌ఎల్‌పి, పార్టీ కార్యవర్గ సంయుక్త భేటీ
సాగునీటి హక్కుల కోసం కెసిఆర్ సమరశంఖం
రెండేళ్ల కాంగ్రెస్ పాలన, హామీల అమలుపై చర్చ
పంచాయతీ ఎన్నికల ఫలితాలు,
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలపైనా సమీక్ష
సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై చర్చ
గ్రేటర్, స్థానిక సంస్థల ఎన్నికలపై
అనుసరించాల్సిన వ్యూహాలపై
పార్టీ శ్రేణులకు కెసిఆర్ దిశానిర్ధేశం
మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చాలా రోజుల విరామం తర్వాత ఆదివారం తెలంగాణ భవన్‌కు రానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కెసిఆర్ అధ్యక్షతన బిఆర్‌ఎస్ శాసనసభాపక్షం, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పార్టీ ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, ఎంపిలతో పాటు కార్యవర్గ సభ్యులు పాల్గొంటారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా, ప్రభుత్వ పాలన తీరు, ఇచ్చిన హామీల అమలుపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ భేటీలో ప్రధానంగా తెలంగాణ సాగునీటి హక్కుల పరిరక్షణ కోసం చేపట్టాల్సిన ప్రజా ఉద్యమంపై కెసిఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. కృష్ణా, గోదావరి జలాలతోపాటు సాగునీటి ప్రాజెక్టులపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ప్రజా ఉద్యమాలకు సంబంధించి పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో లోతుగా చర్చించనున్నట్లు తెలిసింది.
పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం 91 టిఎంసిలు కేటాయిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం కేవలం 45 టిఎంసిలు ఇస్తే చాలని కేంద్రం ముందు దేబరించడం బాధాకరమని బిఆర్‌ఎస్ పార్టీ అభిప్రాయపడుతుంది. నదుల అనుసంధానం పేరుతో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందని, రాష్ట్రం నుంచి గెలిచిన 8 మంది బిజెపి ఎంపీలు ఈ విషయంపై మౌనంగా ఉన్నారని కెసిఆర్ ఆగ్రహంతో ఉన్నారు. ఈ అంశంలో కాంగ్రెస్, బిజెపి పార్టీలను ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాలని బిఆర్‌ఎస్ భావిస్తోంది. రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరన్నట్లుగా ఉందని బిఆర్‌ఎస్ చెబుతోంది. తెలంగాణ రాష్ట్రానికి సాగునీటి విషయంలో కేంద్ర బిజెపి చేస్తున్న అన్యాయాన్ని కానీ., కావేరి తదితర నదుల అనుసంధానం పేరుతో ఆంధ్ర రాష్ట్ర జలదోపిడికి సహకరిస్తున్న కేంద్ర బిజెపి విధానాన్ని గానీ ఎదుర్కోవాలంటే.. తెలంగాణ సమాజం మరొకసారి ప్రత్యక్ష పోరాటాలే శరణ్యం అని పార్టీ అధినేత కెసిఆర్ భావిస్తున్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వమే గనక తిరిగి వచ్చి ఉంటే ఈపాటికి పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి నీళ్లు అందేవి అని, పాలమూరు రంగారెడ్డి నల్గొండ ప్రజల, రైతాంగ ప్రయోజనాలు కాపాడబడేవి అని పేర్కొన్నారు.
కానీ ఇప్పుడు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, పాలమూరు రంగారెడ్డి నల్గొండ ప్రజల ప్రయోజనాల పట్ల పూర్తి నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించడం వల్ల పూచిక పొల్లంత పని కూడా చేయలేకపోవడం వల్ల ఆ ప్రాంతం ప్రజలు రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారని, రెండేళ్లు గడిచినా కూడా తెలంగాణ రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను నిర్లక్ష్యం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇంకా తెలంగాణ సమాజం మౌనం వహించ జాలదు అని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు, కృష్ణా జలాలలో కేవలం 45 టిఎంసిలు ఒప్పుకోవడం అనేది ఘోరం, దుర్మార్గం… కాబట్టి సాగునీరు తెలంగాణ రైతాంగ ప్రయోజనాలను కాపాడే విషయంలో బిఆర్‌ఎస్ పార్టీ ఎన్నటికీ రాజీ పడబోదు అని పార్టీ స్పష్టం చేసింది. ఇటువంటి కీలక సమయంలో పైన తెలిపిన విషయాలతో పాటు, పార్టీ సంస్థాగత నిర్మాణ విషయాలు సహా పలు అంశాలను ఆదివారం నిర్వహించబోయే సంయుక్త సమావేశంలో పార్టీ అధినేత కెసిఆర్ అధ్యక్షతన కూలంకషంగా చర్చించనున్నారు. అందుకు అనుగుణంగా చేపట్టబోయే ప్రజా ఉద్యమాలను నిర్మాణం, అనుసరించాల్సిన కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ,పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణం, జలాల కేటాయింపు, గోదావరి కృష్ణా జలాల విషయంలో, ఆంధ్ర జలదోపిడి పైన పోరాడేందుకు.. ఒక ఉద్యమ స్వరూపానికి ఈ సమావేశంలో శ్రీకారం చుట్టనున్నారు.
పార్టీ బలోపేతంపైనా కెసిఆర్ దృష్టి
బిఆర్‌ఎస్ పార్టీ ప్రక్షాళన, సంస్థాగత బలోపేతంపైనా అధినేత కెసిఆర్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రణాళికలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. చాలాకాలం తర్వాత పార్టీ అధినేత తెలంగాణ భవన్‌కు వస్తుండటంతో బిఆర్‌ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. కెసిఆర్‌కు ఘనంగా ఆహ్వానం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీ సాధించిన ఫలితాలతో పాటు ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలను కూడా కెసిఆర్ సమీక్షించే అవకాశం ఉంది.గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 33 శాతం సీట్లు సాధించడం పట్ల అధినేత సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.
అయితే తక్కువ సర్పంచి స్థానాలు గెలిచిన జిల్లాల్లో పార్టీని మరింత పటిష్టం చేసే దిశగా కార్యాచరణ ప్రకటించనున్నట్లు తెలిసింది. పార్టీ నేతలు, కార్యకర్తలు మరింత సమన్వయంతో పనిచేసి ఉంటే ఇంకా మంచి ఫలితాలు వచ్చేవని కెసిఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీలో చిన్న చిన్న మనస్పర్థలు పక్కనబెట్టి అందరూ సమన్వయం పనిచేయాలని, భవిష్యత్తులో పార్టీ కోసం పనిచేసే అందరికీ మంచి అవకాశాలు వస్తాయని పార్టీ శ్రేణులను దిశానిర్ధేశం చేయనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపాలిటీ, జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు మరింత ఉత్సాహంతో పనిచేసి పార్టీ మెరుగైన ఫలితాలు సాధించేందుకు అనుసంరించాల్సిన వ్యూహాలపై అధినేత కెసిఆర్ బిఆర్‌ఎస్ శ్రేణులకు దిశానిర్ధేశం చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికలపై ఆదివారం జరిగే సమావేశంలో లోతుగా చర్చించనున్నారు.
నందినగర్ నివాసానికి చేరుకున్న కెసిఆర్
బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ శనివారం నగరంలోని నందినగర్ నివాసానికి చేరుకున్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో జరగనున్న పార్టీ శాసనసభాపక్ష, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశానికి ఆయన అధ్యక్షత వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే కెసిఆర్ శనివారం మధ్యాహ్నం ఎర్రవల్లి నివాసం నుంచి నగరంలోని నందినగర్ నివాసానికి వచ్చారు.