మావోయిస్టులతో లింకులు…?
జనగామలో మాజీ మావోయిస్టు గాదె ఇన్నయ్య అరెస్ట్ చేసిన ఎన్‌ఐఎ
గాదె ఇన్నయ్యను అరెస్టు చేసేందుకు ఆశ్రమానికి వచ్చిన ఎన్‌ఐఎ అధికారులను అడ్డుకున్న చిన్నారులు
ఉపా చట్టం కింద కేసు నమోదు
నాంపల్లి ఎన్‌ఐఎ కోర్టు ముందు హాజరుపర్చిన ఎన్‌ఐఎ అధికారులు
14 రోజులు రిమాండ్ విధించిన ఎన్‌ఐఎ కోర్టు, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఎన్‌ఐఎ లోతుగా దర్యాప్తు
మన తెలంగాణ/హైదరాబాద్ : మాజీ మావోయిస్టు, సామాజిక కార్యకర్త గాదె ఇన్నయ్య అరెస్టు కలకలం రేపుతోంది. మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారనే ఆరోపణలతో గాదె ఇన్నయ్యను ఎన్‌ఐఎ అధికారులు అరెస్ట్ చేశారు. జనగామ జిల్లా జాఫర్‌గఢ్ మండల కేంద్రంలో నిర్వహిస్తు న్న అనాథాశ్రమానికి నాలుగు వాహనాల్లో వెళ్లిన ఎన్‌ఐఎ అధికారులు గాదె ఇన్నయ్యను అరెస్టు చేశారు. గాదె ఇన్నయ్యను అరెస్ట్ చేసేందుకు ఆశ్రమానికి వచ్చిన ఎన్‌ఐఎ అధికారులను చిన్నారులు అడ్డుకున్నారు. ఇదివరకే గాదా ఇన్నయ్యపై పలు సెక్షన్ల కింద ఎన్‌ఐఎ కేసులు నమోదు చేసింది. ఈ క్రమంలో గాదె ఇన్నయ్య (గాదె ఇన్నారెడ్డి)ని ఎన్‌ఐఎ ఆది వారం అరెస్ట్ చేసింది. ఆయనపై ఎన్‌ఐఎ తీవ్రమైన అభియోగాలు నమోదు చేస్తూ చర్యలు చేపట్టింది. గాదే ఇన్నయ్యను అరెస్టు చేయడం కోసం పోలీసులు ఆయన నివాసాన్ని చుట్టుము ట్టారు. నిషేధిత సంస్థల భావజాలా న్ని ప్రచారం చేయడం, చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడటం ద్వారా దేశ భద్రతకు ముప్పు కలిగిస్తున్నారనే ఆరోపణల పై ఎన్‌ఐఎ ఆయనతో పాటు ఇతరులపై ఉపా చట్టం కింద కేసులు నమోదు చేసింది. ఈ క్రమం లో జనగామ జిల్లాలో ఎన్‌ఐఎ గాదె ఇన్నయ్యను అదుపులోకి తీసు కుంది.
మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు రామచంద్రారెడ్డి (వికల్ప్) అంత్యక్రియల సందర్భంగా జరిగిన ఒక సభ గాదె ఇన్నయ్య అరెస్టు కు ప్రధాన కారణమైంది. సిపిఐ (మావోయిస్ట్) అనుబంధ సంస్థ అయిన ’అమరుల బంధు మిత్రుల సంఘం’ (ఎబిఎంఎస్) ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ’భారత్ బచావో’ వ్యవస్థాపకుడిగా గాదె ఇన్నయ్య ప్రసంగించారు. తన ప్రసంగంలో భాగంగా భారత ప్రభుత్వ భద్రతా బలగాలు రామచంద్రారెడ్డిని బూటకపు ఎన్‌కౌంటర్‌లో చిత్రహింసలు పెట్టి హత్య చేశాయని ఇన్నయ్య ఆరోపించారు. సుమారు 150 నుండి 200 మంది ప్రజలు పాల్గొన్న ఆ అంత్యక్రియల సభలో గాదె ఇన్నయ్య చేసిన ప్రసం గానికి సంబంధించి తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని ఎన్‌ఐఎ స్పష్టం చేసింది. ఆయన చేసిన ప్రసంగం దేశానికి వ్యతిరేకంగా సాయుధ తిరుగు బాటు కార్యకలాపాలను ప్రేరేపించడానికి ప్రయత్నించినట్లు ఉందని ఎన్‌ఐఎ పేర్కొంది. ఈ కారణంగా కేసు నమోదు చేసి, విచారణ చేస్తున్నట్లు వెల్లడించింది. ముఖ్యంగా యూట్యూబ్‌లో అప్‌లోడ్ అయిన వీడియో సాక్ష్యాలను ఎన్‌ఐఏ సేకరించినట్లు సమాచారం. ఈ ప్రసంగం ద్వారా గాదె ఇన్నయ్య ప్రజలను రెచ్చగొట్టి, దేశానికి వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటు లేదా విధ్వంసక కార్యకలాపాలకు పురికొల్పే ప్రయత్నం చేశారని దర్యాప్తు సంస్థ పేర్కొంది.
హిడ్మా తల్లిని కలిశాడు.. హిడ్మా మరణంపై ఉద్వేగభరిత ప్రసంగం
మావోయిస్టు నేత హిడ్మా ఎన్ కౌంటర్ తర్వాత గాదె ఇన్నయ్య ఛత్తీష్‌గడ్ వెళ్లారు. హిడ్మా తల్లిని కలిశారు. అక్కడున్న నేషనల్, స్టేట్ మీడియాతో పాటు యూట్యూబ్ ఛానళ్లతో హిడ్మా మరణంపై ఉద్వేగభరితమైన ప్రసంగం చేశారు. ఈ సమయంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా మాట్లాడారు. అమిత్ షా తీరును తప్పుబట్టారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై ఎన్‌ఐఎ దృష్టి సారించింది. ఇప్పటికే చాలా సార్లు నోటీసులు పంపింది. తాజాగా, మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో ఇన్నయ్యపై కేసు నమోదు చేసింది. కాగా, ఇన్నయ్య నిర్వహిస్తున్న అనాథాశ్రమంలో 200 మంది అనాథ పిల్లలు ఆశ్రయం పొందుతున్నారు.
గతంలో మావోయిస్టు ఉద్యమంలో కీలక పాత్ర
కాగా, గాదె ఇన్నయ్య గతంలో మావోయిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత జనజీవన స్రవంతిలోకి వచ్చి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నా రు. ప్రస్తుతానికి ఆయన ’భారత్ బచావో’ అనే సంస్థ ద్వారా సామాజిక, రాజకీయ అంశా లపై గళం వినిపిస్తున్నారు. గతంలో కూడా ఆయనపై కొన్ని కేసులు నమోదయ్యాయి. అయితే తాజాగా ఎన్‌ఐఎ రంగంలోకి దిగి అరెస్ట్ చేయడం తో ఈ కేసు తీవ్రత పెరిగింది. ‘ఓ యూట్యూబ్ ఛానెల్‌లో మావోయిస్టు పార్టీకి మద్ధతు తెలుపుతున్నట్లు, మావోయిజాన్ని ప్రోత్సహిస్తున్నట్లుగా గాదె ఇన్నయ్య మాట్లాడిన వీడియో ప్రకారం మేము అరెస్టు చేస్తున్నామని అధికారులు చెప్పారు. ఆ ఇంటర్య్యూ ఇచ్చి రెండు మూడు నెలలైంది. ఆదివారం కావడంతో కోర్టు ఉండదనే కారణంతోనే అరెస్టు చేశారు. సుమారు నలబై యాబై మంది పది కార్లలో వచ్చి అతడు పారిపోతాడేమోనని చుట్టూ నిఘా పెట్టారు. ప్రజల మనిషి ఎటూ పోడూ. తల్లిలాంటి పార్టీపైన ఎంతో కొంత ప్రేమ ఉంటుందే తప్ప అతడు ఎటూపోడు‘- అని గాదె ఇన్నయ్య కుమార్తె అన్నారు.
గాదే ఇన్నయ్యకు 14 రోజుల రిమాండ్ విధించిన ఎన్‌ఐఎ కోర్టు
గాదె ఇన్నయ్య అరెస్టు నాంపల్లి ఎన్‌ఐఏ న్యాయస్థానంలో హాజరు పరిచారు. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. నాంపల్లిలోని ఎన్‌ఐఎ న్యాయస్థానం గాదె ఇన్నయ్యకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను చంచలగూడ జైలుకు తరలించారు.
ఎన్‌ఐఎ లోతుగా దర్యాప్తు…!
ఈ వీడియో క్లిప్పింగులను పరిశీలించిన ఎన్‌ఐఏ అధికారులు, ఇది మావోయిస్టులకు సానుభూతి పెంచే చర్యగా గుర్తించారు. అరెస్టు సందర్భంగా ఆయన నివాసంలో సోదాలు నిర్వహించి పలు మొబైల్ ఫోన్లు, డిజిటల్ పరికరాలు, కొన్ని ముఖ్యమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో మావోయిస్టు పార్టీకి సంబంధించిన కీలక సమాచారం ఉండే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. గతంలో మావోయిస్టు ఉద్యమం లో కీలకంగా పనిచేసిన ఇన్నారెడ్డి, ఆ తర్వాత జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. ప్రస్తుతం జాఫర్‌ఘడ్‌లో అనాథ పిల్లల కోసం ఆశ్రమం నడు పుతున్నారు. అయితే ఆశ్రమం మాటున ఏవైనా చట్టవిరుద్ధ కార్యకలాపాలు సాగుతున్నాయా? అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా మావోయిస్టు నేత హిడ్మా మరణం తర్వాత చెల్లాచెదురైన పార్టీ కేడర్‌ను ఇన్నారెడ్డి ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆశ్రమానికి వచ్చే విరాళాలు, నిధులు మావోయిస్టులకు అందుతున్నాయా? అనే అంశాలపై కూడా ఎన్‌ఐఏ లోతుగా దర్యాప్తు చేస్తోంది.