హైదరాబాద్: తన గన్ మెన్ కృష్ణ చైతన్య ఆత్మహత్యాయత్నం విషయాన్ని సంచలనం చేయవద్దని హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీడియాను కోరారు. ఆదివారం ఉదయం ఎల్ బి నగర్ కామినేనిలో కానిస్టేబుల్ చైతన్యను కలిశానని వివరణ ఇచ్చాడు. అతని పరిస్థితి విషమంగా ఉందని, అతను ఆర్థిక సమస్యల కారణంగా ఆత్మహత్యకు ప్రయత్నించాడని, దాదాపు 2 సంవత్సరాల క్రితం బెట్టింగ్ యాప్‌లు, గేమింగ్ యాప్‌లలో పాల్గొనడం వల్ల అతను ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్నారని, అప్పుల కారణంగా అతని జీతంలో ఎక్కువ భాగం జీతం కట్ అవుతోందని వెల్లడించారు.
ఆదివారం ఉదయం తన గన్ మెన్ కృష్ణ చైతన్య ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడని, అతను ఇంకా బతికే ఉన్నాడని, సర్జరీ జరుగుతోందని తెలియజేశారు. బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని వైద్యులు చెప్పారన్నారు. దాదాపు 3 నెలల క్రితం అతను కుటుంబ సమస్యలతో బాధపడుతూ ఇంటి నుండి వెళ్లిపోయారని, అప్పుడు హయత్‌నగర్ పిఎస్ లో మిస్సింగ్ కేసు నమోదైందన్నారు. అప్పటి నుండి అతను నాడీ సంబంధిత సమస్యలతో పాటు మెదడు గడ్డకట్టడం అనే సమస్యతో బాధపడుతున్నాడని, అతను విధుల్లో బాగానే ఉన్నాడని తెలిపాడు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం మునగనూర్ గ్రామంలోని సూర్యనగర్ లో తన నివాసంలో ఎఆర్ కానిస్టేబుల్ ముత్యాలపాయటి కృష్ణ చైతన్య తన సర్వీసు రివాల్వర్ కాల్చుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే.