దుబాయ్: అండర్-19 ఆసియాకప్ ఫైనల్‌లో పాకిస్థాన్ చేతిలో భారత్ ఘోర పరాజయం పాలైంది. ఐసిసి అకాడమీ గ్రౌండ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 347 పరుగులు చేసింది. ఆ తర్వాత భారీ లక్ష్యంతో బరిలోకి దిగి భారత్ ఆరంభం నుంచి తడబడింది. కెప్టెన్ ఆయుష్ మాత్రే కేవలం 2 పరుగులు మాత్రమే చేసి ఔట్ కాగా.. కీలక ఆటగాళ్లు వైభవ్ సూర్యవంశీ(26), ఆరోన్ జార్జ్(16) రాణించలేకపోయారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన వారెవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్ సాధించలేకపోయారు. చివర్లో వచ్చిన దీపేశ్(36) ఒంటరి పోరాటం చేశాడు. దీంతో భారత్ 26.2 ఓవర్లలో 156 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఫలితంగా పాకిస్థాన్ 191 పరుగుల తేడాతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించి.. అండర్-19 ఆసియాకప్ విజేతగా నిలిచింది.