మీ 12 ఏళ్ళ పాలన, మా రెండేళ్ళ పాలనపై చర్చకు సిద్ధమా?
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ సవాల్
కిషన్ రెడ్డికి సోనియాకు లేఖ రాసే స్థాయి లేదు
మన తెలంగాణ/హైదరాబాద్‌ః “కేంద్రంలో మీ పన్నెండేళ్ళ పాలన, రెండేళ్ళ మా పాలనపై బహిరంగ చర్చకు సిద్ధమా?” అని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండి రాష్ట్రానికి చేసింది ఏమిటో ప్రజలకు చెప్పాలని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని బిజెపి హామీ ఇచ్చినా, అధికారంలోకి వచ్చిన ఈ పన్నెండేళ్ళలో 24 కోట్ల ఉద్యోగాలు కల్పించిన దాఖలాలు లేవని తెలిపారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాసే స్థాయి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేదని ఆయన విమర్శించారు.
తెలంగాణపై అడుగడుగునా కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీపై వత్తిడి తెచ్చే సామర్థం లేని కిషన్ రెడ్డికి సోనియా గాంధీకి లేఖ రాసే నైతిక హక్కు లేదని ఆయన విమర్శించారు. బడ్జెట్ కేటాయింపుల నుంచి అన్ని రంగాల్లో కేంద్రం తెలంగాణపై పక్షపాతం చూపుతున్నదని ఆయన ఆరోపించారు. బిసి రిజర్వేషన్లు, మెట్రో రైలు ప్రాజెక్టు, మూసి నది సుందరీకరణ, రాష్ట్రంలో కేంద్ర విద్యా సంస్థల స్థాపన వంటి కీలక అంశాల్లో ప్రధాని మోడీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంపై వివక్ష చూపుతోందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కనిపించడం లేదా? అని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు.