నామ్రూప్ ః కాంగ్రెస్ పార్టీ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. అసోంలోకి అక్రమంగా బంగ్లాదేశీయులు వచ్చి ఇక్కడ స్థిరపడేలా ప్రోత్సహిస్తోందని ఆయన ఆరోపించారు. అసోంలోని దిబ్రూఘర్ జిల్లా నామ్రూప్‌లో రూ 10,601 కోట్ల వ్యయంతో ఏర్పాటు అయిన ఎరువుల కర్మాగారం ప్రారంభోత్సవం తరువాత జరిగిన సభలో ఆదివారం ప్రధాని మోడీ ప్రసంగించారు. ఈ ఫ్యాక్టరీ బ్రౌన్‌ఫీల్డ్ అమోనియా యూరియా తయారీ ప్లాంట్‌గా నిలుస్తుంది. ప్రతిపక్షం అయిన కాంగ్రెస్‌కు ఈ దేశం అంటే బాధ్యత లేదు. బంగ్లాదేశీయులు ఇక్కడి అడవులు, భూములలోకి ప్రవేశించేందుకు కాంగ్రెస్ సహకరిస్తోంది.
కేవలం పార్టీ ఓటు బ్యాంకును ఈ అక్రమ వలసదార్ల బలంతో పెంచుకోవాలనేదే కాంగ్రెస్ తపన అని తెలిపారు. అసామీల ఉనికి, వారి సాంస్కృతిక ఆచార వ్యవహారాల పట్ల కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదు. బిజెపి ఎప్పుడూ అసామీల ప్రత్యేకతను కాపాడేందుకు కార్యాచరణకు దిగుతోందని అన్నారు. ఇక్కడ చాలా రోజుల నుంచి ఉన్న పాత కర్మాగారాన్ని కాంగ్రెస్ తమ హయాంలో ఏనాడూ ఆధునీకరించలేదని , రైతుల సమస్యల పరిష్కారానికి ఆలోచించలేదని విమర్శించారు. ఈ సభలో ఆయన ప్రసంగం ఎక్కువగా కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయి ఆరోపణలు, విమర్శ్శనాస్త్రాలతోనే సాగింది. అన్నింటికి మించి కాంగ్రెస్ జాతి వ్యతిరేక చర్యలు శృతి మించుతున్నాయని సభలో ఆయన తెలిపారు.
అధికారం కోసం అక్రమ వలసదార్లకు వత్తాసు
అధికారం దక్కించుకోవాలనేదే వారి ఏకైక లక్షం, అందుకే వారు తరచూ ఓటర్ల జాబితాల సవరణను వ్యతిరేకిస్తున్నారు. ఈ సర్ ప్రక్రియ సజావుగా సాగితే వారు ఆశలు పెట్టుకున్న అక్రమ వలసదారుల పేర్లు జాబితాల్లో నుంచి ఎగిరిపోతాయనేదే వారి భయం అని విమర్శించారు. మేము చేసే ప్రతి మంచి పనిని ఎంచుకుని ఎదురుదాడికి దిగడమే వారి పని అయిందని వ్యాఖ్యానించారు. బిజెపి ఎప్పుడూ అస్సామీల ఉనికి వారి భూములు, వారి తరతరాల ఆత్మగౌరవం నిలిపేందుకు యత్నిస్తోందని అన్నారు. అసోంలో రెండు రోజుల పర్యటన ముగింపు రోజున మోడీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అసామీల పట్ల గౌరవం లేని అరాచక పార్టీ
అసామీ భూమి పుత్రుడు డాక్టర్ భూపెన్ హజారికాకు తమ ప్రభుత్వం భారత రత్న ప్రదానం చేసింది. దీనిని కాంగ్రెస్ బహిరంగంగా వ్యతిరేకించిందని మోడీ తెలిపారు. ఆటగాళ్లు పాటగాళ్లకు మోడీ ప్రభుత్వం అత్యున్నత పురస్కారాలను కట్టబెడుతోందని, పరువు తీస్తోందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మాట్లాడారంటే వారికి ఇక్కడి ప్రముఖుల పట్ల ఎంతటి గౌరవం ఉందనేది తెలుస్తుందని ప్రధాని మోడీ స్పందించారు. కాంగ్రెస్ మాటలు భూపెన్ దా పట్లనే కాకుండా అసాం ప్రజలందరి పట్ల అవమానించినట్లుగానే ఉన్నాయని విమర్శించారు.
అహోం రాజుల నాటి వైభవం
శతాబ్దాల క్రితం అహోం రాజుల కాలంలో ఉన్నంత శక్తివంతంగా అస్సాంను తీర్చిదిద్దడమే బిజెపి లక్షం అన్నారు. ఇక్కడి అపార వనరులను సద్వినియోగం చేయడం, వాటికి అంతర్జాతీయ ఖ్యాతి వచ్చేలా చేయడం కోసం తమ ప్రభుత్వం పలు చర్యలకు దిగుతోందని వివరించారు. ఇక్కడ ఇప్పుడు ప్రారంభించిన ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి మొదలైన నాటి నుంచే ఏటా 12.7 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల ఉత్పత్తి అవుతుందని మోడీ చెప్పారు. దీనితో ఈ ప్రాంతంలో ఎరువుల సరఫరా గొలుసుకట్టు క్రమం అంతా పదిలం అవుతుంది.ఇది రైతాంగానికి మేలు చేస్తుందని తెలిపారు. అసోంలో ఉత్పత్తి అయిన బ్లాక్‌టీని రష్యా అధ్యక్షులు పుతిన్‌కు ఇటీవల తాము ఆయన భారత్ పర్యటనకు వచ్చినప్పుడు కానుకగా ఇచ్చామని గుర్తుచేశారు.