హైదరాబాద్: ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించినట్లు భారత రాష్ట్ర సమితి అధినేత కెసిఆర్ అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌పై ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందన్నారు. తనను దూషించడం, చనిపోవాలని శాపాలు పెట్టడమే ప్రభుత్వ విధానమని విమర్శించారు. బిఆర్ఎస్ శాసనసభాపక్షం, రాష్ట్ర కార్యవర్గ భేటీ తెలంగాణ భవన్‌లో జరిగింది. పార్టీ ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యవర్గ సభ్యులతో కెసిఆర్ భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘పార్టీ గుర్తులతో ఎన్నికలు జరిగి ఉంటే బిఆర్ఎస్ సత్తా తెలిసేది. పార్టీ గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, గర్వంతో ఎగిరే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ప్రజలు బుద్ధి చెప్పారు. మేము అధికారంలో ఉన్నప్పుడు అహంకార వైఖరి ప్రదర్శించలేదు. కాంగ్రెస్ ఒక కొత్త పాలసీ కూడా తేలేదు. తీసుకొచ్చిన పాలసీ.. రియల్ ఎస్టేట్ కోసమే. రాష్ట్రంలో ప్రజల ఆస్తుల విలువ పూర్తిగా తగ్గింది. ఒకప్పుడు యూరియా ఇంటికి వచ్చేది. ఇప్పుడు యూరియా కోసం కుటుంబమంతా లైన్‌లో నిలబడే పరిస్థితి వచ్చింది’’ అని విమర్శించారు.