కాంగ్రెస్ ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ ముగిసింది
సిఎం సంగతి తెలియదు కానీ.. నేను మాత్రం రేవంత్‌తో ఫుట్‌బాల్ ఆడుకుంటా
వాళ్ల ఇంట్లోని మహిళలు, మనవడి గురించి మాట్లాడను
నేను ఫెయిల్యూర్ లీడర్‌ను కాదు, వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక జిల్లా పరిషత్‌లు, మున్సిపాలిటీలు గెలిపించా
పిసిసి చీఫ్‌గా రేవంత్ ఏడు ఉప ఎన్నికల్లో ఓడిపోయారు
పంచాయతీల్లో 60శాతం కాంగ్రెస్ గెలిస్తే ఆ పదిమంది ఎంఎల్‌ఎలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు రావాలి
రేవంత్‌కు భయపడి పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు
ఢిల్లీలో సిఎం నివాసాన్ని రీమోడల్ చేయించింది ఒక బిజెపి ఎంపి
మీడియాతో కెటిఆర్ చిట్‌చాట్
మనతెలంగాణ/హైదరాబాద్ : సిఎం రేవంత్ రెడ్డి..ఎవరితో ఫుట్‌బాల్ ఆడుకుంటాడో నాకు తెలియదు… నేను మాత్రం రేవంత్ రెడ్డిని ఫుట్‌బాల్ ఆడుకుంటాను అంటూ బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను ఫెయిల్యూర్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడంపై ఆయన స్పందిస్తూ తాను ఫెయిల్యూర్ నాయకుడిని కాదని అన్నారు. తాను వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక 32 జిల్లా పరిషత్‌లు, 136 మున్సిపాలిటీలను గెలిచామని గుర్తు చేశారు. అయితే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 7 ఉప ఎన్నికలు నిర్వహిస్తే అన్ని స్థానాల్లో ఓడిపోయారని తెలిపారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక సొంత పార్లమెంటు స్థానాన్ని కూడా గెలిపించలేకపోయారని విమర్శించారు. తాను ఐరన్ లెగ్ కాదని, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీలే ఐరన్ లెగ్‌లు అని పేర్కొన్నారు. ఢిల్లీలో రేవంత్ రెడ్డి విందులు, వినోదాలు ఎవరి ఇళ్లల్లో జరుగుతున్నాయో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. రేవంత్ ఇంట్లోని మహిళలను, పిల్లలను, మనుమడి గురించి తాను మాట్లాడను అని, రేవంత్ రెడ్డి మాదిరి కుటుంబ సభ్యుల విషయంలో తాను చిల్లర రాజకీయాలు చేయను అని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాజకీయ పోరాటం కేవలం నేతల మధ్యే ఉండాలని పేర్కొన్నారు. అస్సాం సిఎం రాహుల్ గాంధీ పుట్టుకను ప్రశ్నించినప్పుడు కూడా కెసిఆర్ ఖండించారని గుర్తు చేశారు. రాజకీయాల్లోకి కుటుంబ సభ్యులను లాగడం తాను ఏనాడూ చేయలేదని చెప్పారు.
రేవంత్ రెడ్డి మాదిరి కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగి, ప్రత్యర్థుల చావును కోరుకునేంత నీచమైన మనస్తత్వం తనది కాదని అన్నారు. రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు, ఆయన మనవడు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు బాగుండాలని ప్రార్థిస్తానని తెలిపారు. రాజకీయంగా మాత్రం రేవంత్ రెడ్డిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో శనివారం కెటిఆర్ మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి పాలన, రాజకీయ విలువలపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సుమారు గంటకు పైగా సాగిన ఈ చర్చలో రాజకీయ ఫిరాయింపులు, బిసి రిజర్వేషన్లు, కాంగ్రెస్- బిజెపి అంతర్గత ఒప్పందాలు, రాష్ట్ర అభివృద్ధి కుంటుపడటం వంటి అంశాలపై కెటిఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
పార్టీ భవిష్యత్తు కార్యాచరణ కెసిఆర్ దిశానిర్దేశం
కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న హనీమూన్ పీరియడ్ ముగిసిందని, ఇకపై కెసిఆర్ నేరుగా ప్రజల్లోకి వస్తారని కెటిఆర్ ప్రకటించారు.ఆదివారం జరిగే రాష్ట్ర స్థాయి సమావేశంలో కెసిఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. భవిష్యత్తు కార్యాచరణపైన సమావేశంలోనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత భారీ ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడతామని కెటిఆర్ వెల్లడించారు.
బిసి రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్‌ది పచ్చి మోసం
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసిందని కెటిఆర్ విమర్శించారు. అందుకే 23 శాతం ఉన్న రిజర్వేషన్లను పంచాయతీ ఎన్నికల్లో 17 శాతానికి తగ్గించిందని మండిపడ్డారు. పార్టీలపరంగా 42 శాతం రిజర్వేషన్ ఇచ్చే అంశంపై రేవంత్ రెడ్డికి సంబంధమే లేదని, ఆయన సొంత పార్టీతో పాటు ఇతర పార్టీలకు ఆయన అధ్యక్షుడు కాదని పేర్కొన్నారు. బిసిలను మోసం చేసినందుకు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ బిసిలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.బిసిలకు సీట్లు ఇచ్చే అంశంలో కాంగ్రెస్ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన పరిస్థితి తమ పార్టీకి లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ 42 శాతానికి మించి, అన్ని సందర్భాల్లో బిసిలకు సరైన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించిన పార్టీ తమది అని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ 12 జనరల్ సీట్లలో 6 సీట్లు (50 శాతం) బిసిలకు ఇస్తే, కాంగ్రెస్ ఎన్ని ఇచ్చిందని ప్రశ్నించారు. అసెంబ్లీలో తాము 34 సీట్లు బిసిలకు ఇస్తే, కాంగ్రెస్ కేవలం 19 సీట్లు మాత్రమే ఇచ్చిందని గణాంకాలు వివరించారు. 42 శాతం బిసి రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తెచ్చి, బిసి డిక్లరేషన్‌లోని అన్ని అంశాలపై రేవంత్ రెడ్డి బిసిలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ బిజెపి మధ్య లోపాయికారి ఒప్పందం
కాంగ్రెస్, బిజెపి పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని కెటిఆర్ ఆరోపించారు. ఢిల్లీలో బిజెపి ఎంపీ దూబే గృహప్రవేశానికి రేవంత్ రెడ్డి ఎందుకు వెళ్లారో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు చెప్పాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ తుగ్లక్ రోడ్‌లో రేవంత్ రెడ్డి నివాసాన్ని రీమోడల్ చేయించింది ఒక బిజెపి ఎంపీయేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. సిఎం రమేష్ వంటి వారికి రేవంత్ రెడ్డి కాంట్రాక్టులు ఇస్తుంటే, బిజెపి ఆయనకు అండగా నిలుస్తోందని ఆరోపించారు. తెలంగాణ కాంగ్రెస్ ఎటిఎంగా మారిందని, ఇక్కడ ఆర్‌ఆర్ ట్యాక్స్ నడుస్తోందని సాక్షాత్తు ప్రధాని, హోంమంత్రి అన్నా కూడా బిజెపి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అఖిలేష్ యాదవ్ తమకు మొదటి నుంచి మిత్రుడు అని, ఆయనతో కలిస్తే బిజెపి నేతలకు ఎందుకు బాధ..? అని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడుల తర్వాత కూడా కేసు నమోదు చేయని ఏకైక సందర్భం తెలంగాణ మంత్రి పొంగులేటి అంశంలోనే ఉన్నదని, ఈ అంశం మీద బిజెపి నాయకులు మాట్లాడాలన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వల్ల ఎవరికీ లాభం లేదని పేర్కొన్నారు. తెలంగాణకు ఒక్క రూపాయి కూడా అదనంగా తేలేని కిషన్ రెడ్డితో తమకేం లాభం ఉంటుందని ప్రశ్నించారు. బిఆర్‌ఎస్, బిజెపి ఒకటే అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కెటిఆర్ స్పందిస్తూ.. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్, బిజెపిల మధ్య అద్భుతమైన మైత్రి బంధం ఉన్నదని, అది రేవంత్ రెడ్డికి, బిజెపి నేతలకు కూడా తెలుసు అని అన్నారు. అందుకే ప్రధానమంత్రి కూడా బిజెపి నేతలకు తలంటి పోసినట్లు వార్తలు వచ్చాయన్న అంశాన్ని ప్రస్తావించారు.
ధమ్ముంటే ఫిరాయింపు ఎంఎల్‌ఎలతో రాజీనామా చేయించాలి
పంచాయతీ ఎన్నికల్లో సిఎం రేవంత్‌రెడ్డి చెబుతున్నట్లు కాంగ్రెస్‌కు 66 శాతం సీట్లు గెలుచుకున్నది నిజమైతే.. పార్టీ ఫిరాయించిన పది మంది ఎంఎల్‌ఎలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు రావాలి కెటిఆర్ సిఎం రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు. అభివృద్ధి కోసం పార్టీ మారామని ఎంఎల్‌ఎలు మైకుల్లో బహిరంగంగా చెబుతున్నారని, కాంగ్రెస్ ఆఫీసులో కూర్చుని తాము బిఆర్‌ఎస్‌లోనే ఉన్నామనడం పెద్ద కామెడీ అంటూ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే పార్టీ మారిన పది మంది ఎంఎల్‌ఎలతో రాజీనామా చేయించి, ఉప ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి వంటి వారు స్పీకర్ ముందు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని, బయట మాత్రం రాహుల్ గాంధీ కండువా కప్పుకున్నామని చెబుతున్నారని మండిపడ్డారు. ఫిరాయింపు ఎంఎల్‌ఎల పరిస్థితి గబ్బిలాల్లా తయారైందని, పదవుల కోసం ఇంత దిగజారడం దురదృష్టకరమని విచారం వ్యక్తంఒ చేశారు.
పాలనా వైఫల్యం – పారిశ్రామికాభివృద్ధికి విఘాతం
రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రం వెనక్కి వెళ్తోందని, పారిశ్రామికవేత్తలు భయపడి ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతున్నారని కెటిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. విరూపాక్ష ఫార్మా వంటి కంపెనీలు కర్నూలుకు వెళ్ళిపోవడమే దీనికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. లగచర్లలో ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా డ్రామాలు ఆడుతున్నారని, గ్రీన్ ట్రిబ్యునల్ మొట్టికాయలు వేసినా వీళ్లకు బుద్ధి రాలేదని విమర్శించారు. ఫార్మాసిటీ రద్దు, ఫార్మా విలేజీల ఏర్పాటు అంటూ అడ్డమైన విధానాల వలనే ఈ పరిస్దితి వచ్చిందన్నారు.
పేర్ల మార్పు విషయంలో బిజెపి, కాంగ్రెస్ దొందు దొందే
ఉపాది హమీకి చేసిన సవరణల వలన గ్రామీణ పేదలకు అన్యాయం జరుగుతోందని కెటిఆర్ ఆరోపించారు.ఈ అంశంపైన ప్రియాంక గాంధీ పార్లమెంట్‌లో మాట్లాడుతూ పేర్ల మార్పు వల్ల దేశవ్యాప్తంగా అదనపు భారం పడుతుందని చెప్పారని, తన సొంత ప్రభుత్వం ఇక్కడ అడ్డగోలుగా పథకాల పేర్లను, ప్రాంతాల పేర్లను మార్చినప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. పేర్ల మార్పు విషయంలో బిజెపి, కాంగ్రెస్ రెండూ దొందు దొంగే అని విమర్శించారు. ఉపాధి హామీ చట్టానికి పేరు మార్పిడిపై గగ్గోలు పెడుతున్న కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలోనూ అదే ధోరణి కొనసాగిస్తున్నదన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయానికి రాజీవ్ గాంధీ పేరు పెట్టింది కాంగ్రెస్ పార్టీయేనని, పేర్ల మార్పిడి మాత్రమే కాకుండా తెలంగాణ తల్లిని కూడా మార్చిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు చేస్తున్న విమర్శలపైన ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. బిజెపి ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరును తీసివేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. గాంధీ మహాత్ముని పేరును తీసివేయాలనే ఆలోచన బిజెపికి ఎలా వచ్చిందని అడిగారు. బిజెపి పేరు మార్పు మాత్రమే కాకుండా, ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడిచేలా అనేక నిబంధనలు ఉంచిందని, ఈ అంశాన్ని తమ పార్టీ తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని కెటిఆర్ వెల్లడించారు.