మన తెలంగాణ/హైదరాబాద్: ఆధునికత, ఆధ్యాత్మికత సమ్మేళనమే మన నాగరికతకు ఉన్న అతిపెద్ద బలం అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. వసుధైక కుటుంబకం అనే భావన ప్రపంచమంతటినీ ఒకే కుటుంబంగా భావించే ఆలోచనని, ఇది నేటి ప్రపంచ శాంతికి అత్యంత అవసరమని ఆమె తెలిపారు. బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్ సంస్థ 21వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో శనివారం నిర్వహించిన “భారతదేశ శాశ్వత జ్ఞానం: శాంతి, ప్రగతికి మార్గాలు” అంశంపై జరిగిన సదస్సును ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు.
ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ ప్రపంచ సమాజం అనేక మార్పులకు లోనవుతోందన్నారు. ఈ మార్పులతో పాటు మనమూ మానసిక ఆరోగ్య సమస్యలు, సామాజిక సంఘర్షణలు, పర్యావరణ అసమతుల్యత, మానవీయ విలువల క్షీణత వంటి అనేక తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ సదస్సు కోసం ఎంచుకున్న అంశం చాలా సందర్భోచితంగా ఉందన్నారు. కేవలం భౌతిక అభివృద్ధి మాత్రమే సంతోషాన్ని, శాంతిని తీసుకురాదని మనం గుర్తుంచుకోవాలని సూచించారు. అంతర్గత స్థిరత్వం, భావోద్వేగ మేధస్సు, విలువలతో కూడిన జీవన విధానం అత్యంత అవసరమని తెలిపారు.