హైదరాబాద్: కాంగ్రెస్‌కు 66 శాతం సర్పంచ్ స్థానాలు నిజమైతే.. ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలు పెట్టాలని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సవాల్ విసిరారు. అంతేకాక.. ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని ఛాలెంజ్ చేశారు. కాంగ్రెస్, బిజెపి.. రెండు పడవలపై రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్నారని ఎద్దేవా చేశారు. బిజెపి, కాంగ్రెస్ పూర్తి అవగాహనతో పని చేస్తున్నాయని అన్నారు. బిజెపి ఎంపిల నివాసాల్లో విందులకు రేవంత్ రెడ్డి ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. ఆదివారం జరిగే బిఆర్ఎస్ భేటీలో నదీ జలాలపై ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని.. దాంతో పాటు సభ్యత్వ నమోదు సహా సంస్థాగత అంశాలపై చర్చ ఉంటుందని తెలిపారు. 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరామని బహిరంగంగా చెప్పారని.. సభాపతి మాత్రం ఆధారాలు లేవని విడ్డూరమైన తీర్పు ఇచ్చారని ధ్వజమెత్తారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో న్యాయపోరాటం చేస్తామని పేర్కొన్నారు.
అంతేకాక.. తాను వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక బిఆర్ఎస్ చాలా ఎన్నికల్లో గెలిచిందని.. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయ్యాక కాంగ్రెస్ చాలా చోట్ల ఓడిందని కెటిఆర్ పేర్కొన్నారు. రాహుల్ నేతృత్వంలో కాంగ్రెస్ చాలా ఎన్నికల్లో ఓడిపోయిందని ఎద్దేవా చేశారు. గ్రేటర్‌లో మున్సిపాలిటీల విలీనం సక్రమంగా జరగలేదని ఆరోపించారు. గ్రేటర్‌ను మూడు కార్పొరేషన్లుగా.. అంటే హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ కార్పొరేషన్లుగా చేయాలనేది సిఎం రేవంత్ ఆలోచన అని అన్నారు. ఫార్ములా-ఇ, కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో ఏమీ లేదని సిఎంకు అర్థమైందని.. రేవంత్ దెబ్బకు పరిశ్రమలు అన్ని ఎపికి తరలిపోతున్నాయని మండిపడ్డారు. 42 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇవ్వాలని చెప్పటానికి రేవంత్ ఎవరూ అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి నుంచి నేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. కిషన్‌రెడ్డితో మాకు అవగాహన ఉంటే.. ఆయన రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని సవాల్ విసిరారు.