అమరావతి: రాజకీయ నేతల ఒత్తిడి తట్టుకోలేక ఓ తహశీల్దారు అస్వస్థతకు గురై కుప్పకూలిపోయాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… చౌటపాచర్ల పరిధిలోని భూములను కొందరు నాయకులు ఆక్రమించారు. బాధితుడు లక్ష్మణ్ కుమార్ ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లడంతో విచారణం చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పోలీసుల బందోబస్తు మధ్య తహశీల్దారు వెంకటేశ్వర్లు తన సిబ్బందితో కలిసి ఆ భూములను పరిశీలించాడు. అనంతరం ఇరువర్గాలను తాహశీల్దారు ఆఫీస్‌కు పిలిపించి మాట్లాడారు. రాజకీయ నేతల ఒత్తిడి ఎక్కువగా ఉండడంతో ఒక్కసారిగా తహశీల్దారు అస్వస్థతకు గురై కిందపడిపోయాడు. వెంటనే అతడిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం ఒంగోలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ భూముల విచారణ బాధ్యతలు డిప్యూటీ తహశీల్దారుకు అప్పగించారు.