మన తెలంగాణ/హైదరాబాద్‌ః “మీ నిర్వాకం వల్లే సగం సీట్లు కోల్పోయాం.. లేకపోతే వందకు తొంబై శాతం గ్రామ పంచాయతీ సీట్లను కైవసం చేసుకునేవాళ్ళం.. సర్పంచ్‌లుగా బంధు, మిత్రులను పోటీకి దించుతారా?.. తిరుగుబాటు అభ్యర్థులను బుజ్జగించి పోటీ నుంచి విరమింపజేయడంలో విఫలమయ్యారు.. ఇలాంటివి భవిష్యత్తులో పునరావృత్తమైతే ఊరుకోను” అని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి 18 మంది ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌తో, పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్‌తో పంచాయతీ ఎన్నికల ఫలితాలపై టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.
ఈ కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గాల వారీగా ఫలితాల చిట్టాను దగ్గర పెట్టుకుని యాభై శాతానికి తక్కువ స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందిన ఎమ్మెల్యేల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కువగా నల్లగొండ, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాల్లోని పార్టీ ఎమ్మెల్యేలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. ఎమ్మెల్యేలపై ఎంతో నమ్మకం పెట్టుకుంటే, పుట్టి ముంచారని ఆయన అన్నారు. పార్టీ అభ్యర్థులు నిలబడిన తర్వాత అక్కడే తిరుగుబాటు (రెబెల్స్) అభ్యర్థులు పోటీ చేస్తే మన ఎమ్మెల్యేలు నిలువరించలేకపోయారని ఆయన ఆగ్రహంగా అన్నారని తెలిసింది. కొంత మంది ఎమ్మెల్యేలు పట్టుబట్టి బంధు, మిత్రులను పోటీకి దించడంతో, వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు అభ్యర్థులు పోటీ చేశారని అందుకే భారీ నష్టం వాటిల్లిందన్నారు.
అంతేకాకుండా రెబెల్స్‌ను పోటీ నుంచి ఎందుకు తప్పించలేకపోయారని ఆయన ప్రశ్నించారు. వారిని వద్దని ఎందుకు వారించలేకపోయారు?, వారిని పోటీ నుంచి తప్పించే విషయంలో జిల్లా మంత్రికో, ఇన్‌ఛార్జి మంత్రికో చెప్పి వారిని పోటీ నుంచి తప్పించేందుకు ఎమ్మెల్యేలు చేసిన ప్రయత్నం ఏమిటో తనకు తెలియజేయాల్సిందిగా ఆ ఎమ్మెల్యేలకు చెప్పాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్‌తో అన్నట్లు తెలిసింది. బరిలో నుంచి తిరుగుబాటు అభ్యర్థులను తప్పించి ఉంటే మరో ఇరవై, ముప్పై శాతం సీట్లు పెరిగేవని ఆయన అన్నట్లు సమాచారం. ఏదైనా ఎమ్మెల్యేల నిర్వాకం వల్ల పార్టీకి నష్టం వాటిల్లిందని ఆయన కోపంగా అన్నారని పార్టీ వర్గాల సమాచారం. మున్ముందు జాగ్రత్తగా ఉండాలని, పునరావృతమైతే తాను ఊరుకోనని చెప్పాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నట్లు తెలిసింది.