నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన సినిమా ‘గుర్రం పాపిరెడ్డి’. ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మించారు. డార్క్ కామెడీ కథతో ఇప్పటి వరకు మనం తెరపై చూడని కాన్సెప్ట్‌తో దర్శకుడు మురళీ మనోహర్ రూపొందించారు. ‘గుర్రం పాపిరెడ్డి‘ సినిమా శుక్రవారం థియేటర్లలో విడుదలైంది.
కథ: గుర్రం పాపిరెడ్డి (నరేష్ అగస్త్య) అలాగే సౌదామిని (ఫరియా అబ్దుల్లా) కలిసి గొయ్యి (జీవన్), చిలిపి (వంశీధర్ గౌడ్), మిలట్రీ (రాజ్ కుమార్ కసిరెడ్డి)లతో మాట్లాడి శ్రీశైలంలో ఉన్న ఒక శవాన్ని తీసుకొచ్చి శ్రీనగర్ కాలనీలోని స్మశాన వాటికలో మరో శవంతో మార్చాలని ప్లాన్ వేస్తారు. ఈ క్రమంలో రాజ కుటుంబీకులు హైగ్రీవ (జాన్ విజయ్), నీలగ్రీవ (ప్రదీప్ రుద్ర) లు గుర్రం పాపిరెడ్డిని టార్గెట్ చేసి అతన్ని వెతుకుతూ ఉంటారు. అసలు గుర్రం పాపిరెడ్డి ఎవరు? పైగా వాళ్ళ ఆస్తి ఎందుకు కొట్టేయాలని చూస్తాడు? అసలు ఆ శవం ఎవరిది? ఎందుకు మార్చాలనుకున్నారు? అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూడాలి.
విశ్లేషణ: తెలుగులో గతంలోనూ డార్క్ కామెడీ థ్రిల్లర్‌లు చాలానే వచ్చాయి. కానీ ‘గుర్రం పాపిరెడ్డి’ సినిమా రొటీన్‌గా సాగి ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఈ డార్క్ కామెడీ మూవీలో ఫన్ అండ్ ట్విస్ట్‌లు అక్కడక్కడా ఉన్నప్పటికీ, కథనం మాత్రం చాలా సాగదీతగా ఉండడంతో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టినట్టుగా ఉంటుంది. ప్రారంభంలో ఫన్ ట్రాక్స్‌తో వెళ్లిన సినిమా మెయిన్ ప్లాట్‌లోకి వెళ్లిన తర్వాత అందులో బలం లేదు అనిపిస్తుంది. ఇక సెకండాఫ్ కథలో వేగం తగ్గుతుంది. కోర్టు రూమ్ డ్రామా మొదలైనప్పటి నుంచి కథలో సీరియస్‌నెస్ తగ్గిపోయింది. సింపుల్ కథకు పురాణాలను లింక్ పెట్టడంతో లాజిక్ మిస్ అయినట్లు అనిపిస్తుంది. ఇక నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా తమ నటనతో పర్వాలేదనిపించారు. యోగిబాబు లాంటి కోలీవుడ్ కమేడియన్‌ని పెట్టుకొని తక్కువే వాడుకున్నారు. ఇంకా లెజెండరీ బ్రహ్మానందంకి మంచి ఫన్ ట్రాక్స్ సెట్ చేసుకొని ఉంటే బాగుండేది. ఈ సినిమా చూస్తున్నంతసేపు ఈ మధ్య కాలంలోనే వచ్చిన కొన్ని ఫన్ క్రైమ్ థ్రిల్లర్స్ గుర్తు రాక మానవు. కొత్తదనం ఆశించేవారికి ఈ సినిమా నిరాశపరుస్తుంది. దీనికి తోడు కథనంకి పాటలు మరింత అడ్డుగా అనిపిస్తాయి. ఈ సినిమాలో బోర్‌గా అనిపించే అంశాలు చాలానే ఉన్నాయి. చివరగా ‘గుర్రం పాపిరెడ్డి’ సినిమా ప్రేక్షకులను అలరించలేక నిరాశపరిచింది.