అమరావతి: బూర్గుల రామకృష్ణారావు, పొట్టి శ్రీరాములు ఎప్పుడూ తన గుండెల్లో ఉంటారని ఎపి డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ తెలిపారు. గతంలో పొట్టి శ్రీరాములను వైశ్య కులానికి పరిమితం చేశారని, పొట్టి శ్రీరాములు గొప్పదనాన్ని నెల్లూరు జిల్లాకే పరిమితం చేశారని అన్నారు. వందల కులాల కోసం పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగం చేశారని కొనియాడారు. నిడదవోలు మండలం పెరవలిలో డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ పర్యటించారు. అమరజీవి జలధార పథకానికి శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టు వివరాలను పవన్ కల్యాణ్ కు అధికారులు వివరించారు. నిడదవోలు సభలో పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు వైసిపికి భయపడలేదని, అధికారంలోకి వస్తే చంపేస్తామని బెదిరించారని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు మీ బెదిరింపులకు భయడలేదని, బాధ్యత మరిచి ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మళ్లీ తామే వస్తే ఒక్కొక్కరిని చంపేస్తామని అంటున్నారని, కాంట్రాక్టర్లను జైళ్లలో పెడతామని బెదిరిస్తున్నారని, ధ్వజమెత్తారు. బెదిరించే నాయకులకు పవన్ భయపడడని సూచించారు.
పదేళ్లు పార్టీ పెట్టి కూడా తాను వెనక్కి తగ్గానని, సీట్లు అమ్ముకున్నానని తనను విమర్శించారని అన్నారు. ప్రజలకోసం సీట్లు తగ్గించుకున్నానని, తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పోరాడిన బూర్గుల, పొట్టి శ్రీరాములు తనకు స్ఫూర్తి అని స్పష్టం చేశారు. తెలుగుజాతి, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఏకమయ్యామని, విభిన్న పార్టీల భావజాలం నుంచి వచ్చి ఒక్కటయ్యామని తెలియజేశారు. ఒకే కుటుంబం కోసం అందరం ఆలోచించామని, వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు 5 జిల్లాల పరిధిలో రూ.7,910 కోట్ల ఖర్చు చేశామని అన్నారు. ప్రాజెక్టు ద్వారా 1.20 కోట్ల మంది దాహార్తి తీర్చాలన్నదే లక్ష్యమని, ఎక్కువ తీర ప్రాంతాలు కలిపే లక్ష్యంతో ప్రాజెక్టు రూపకల్పన చేశామని చెప్పారు. 2027 నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలనే లక్ష్యంతో సాగుతున్నామని పవన్ పేర్కొన్నారు.
తెలుగువారికి ఉనికి ఇచ్చిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని.. ప్రాణత్యాగం చేసిన వ్యక్తి చనిపోయాక తీసుకెళ్లేందుకు ఎవరూ లేరని ఆవేదన వ్యక్తం చేశారు. నాడు ఘంటసాల ముందుకు వచ్చి పొట్టి శ్రీరాములు మృతదేహాన్ని ఖననం చేశారని, తెలుగుజాతి, ఆత్మగౌరవం అని మాట్లాడేందుకు మూల కారకుడు పొట్టి శ్రీరాములు అని ప్రశంసించారు. నాయకులకు కులాలు అంటగడితే.. కులాల సమూహంలానే ఉంటామని, భారతీయులుగా ఉండలేమని అన్నారని తెలిపారు. పవన్ కల్యాణ్ సభలో పెద్ద ఎత్తున అభిమానులు కేరింతలు కొట్టారు. బారికేడ్లు దాటుకుని ముందుకు రావద్దని అభిమానులను వారించారు. ఇలాంటి పరిస్థితుల వల్లే తాను ఉన్న సభలకు ప్రధాని కూడా రావడానికి ఆలోచిస్తారని, ప్రధాని నరేంద్ర మోడీకి ప్రపంచమంతా శత్రువులు ఉన్నారని.. ఏ మూల నుంచి దాడి చేస్తారో తెలియదని అన్నారు. అభిమానులకు ఉత్సాహం మంచిదే కానీ నియంత్రణ పాటించాలని పవన్ సూచించారు.