ఐసిసి టి-20 ప్రపంచకప్‌కి ఇంకా రెండు నెలల సమయం కూడా లేదు. 2026, ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకూ ఈ టోర్నమెంట్ జరుగనుంది. ఇప్పటికే ఈ ప్రతి జట్టు ఈ మెగా టోర్నమెంట్ కోసం కసరత్తు ప్రారంభించాయి. మరోవైపు ఈ సారి టి-20 ప్రపంచకప్‌కి భారత్, శ్రీలంక ఆతిథ్యమిస్తున్నాయి. దీంతో శ్రీలంక బోర్డుతో సమన్వయం చేసుకుంటూ బిసిసిఐ ఏర్పాట్లు చేస్తోంది. తాజాగా ఈ టోర్నమెంట్‌లో పాల్గొనే 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బిసిసిఐ ప్రకటించింది. ఇందులో శుభ్‌మాన్ గిల్‌కు చోటు దక్కలేదు. యువ వికెట్ కీపర్ జితేశ్ శర్మకి కూడా అవకాశం లభించలేదు.
ఇక సూర్యకుమార్ యాదవ్‌కి సారథ్య బాధ్యతలు అప్పగించగా.. వైస్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్ వ్యవహరించనున్నాడు. మరోవైపు దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ఇషాన్ కిషన్‌కు జట్టులో చోటు దొరికింది. 2023 నవంబర్‌లో ఇషాన్ చివరిగా టి-20 ఆడాడు. ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఇషాన్ చెలరేగిపోయాడు. 517 పరుగులతో టోర్నమెంట్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ట్రోఫీ విజేతగా ఝార్ఖండ్ నిలవడంలో అతను కీలక పాత్ర పోషించాడు.
టి-20 ప్రపంచకప్‌కి భారత జట్టు:
సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), అక్షర్ పటేల్(వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, హార్థిక్ పాండ్యా, శివమ్ దూబే, సంజు శాంసన్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్.