మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (టిజిఓ) ప్రధాన కార్యదర్శిగా బి. శ్యాం (ప్రస్తుతం అసిస్టెంట్ కమిషనర్, వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున్నారు) నియమితులయ్యారు. ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఏ.సత్యనారాయణ ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఈ పదవికి ఎంపిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలోనే శనివారం నాంపల్లిలోని టిజిఓ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ప్రధాన కార్యదర్శిగా బి. శ్యాంను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా టిజిఓ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ 33 జిల్లాలు, రెండు స్పెషల్ బ్రాంచ్‌ల అధ్యక్ష, కార్యదర్శులు, సెంట్రల్ కమిటీ సభ్యుల అభిప్రాయ సేకరణ తీసుకున్న తరువాతే శ్యాంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని ఆయన వెల్లడించారు.
ఈనెల 11వ తేదీ, 12, 15, 16, 19వ తేదీల్లో కేంద్ర ఎగ్జిక్యూటివ్ సభ్యుల అభిప్రాయ సేకరణ సైతం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. విస్తృత అభిప్రాయ సేకరణలో భాగంగా మెజార్టీ సభ్యులందరూ ప్రధాన కార్యదర్శి ఎన్నికకు సంబంధించి విస్తృత అధికారాలను కల్పించారని అందులో భాగంగా శ్యాంను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా శ్యాం మాట్లాడుతూ తన పై నమ్మకం ఉంచి టిజిఓ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు సూచనల మేరకు పనిచేస్తూ అధికారుల సమస్యలు పరిష్కరించే దిశగా పనిచేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో టిజిఓ ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఏ సత్యనారాయణ, ఇతర సభ్యులు పాల్గొన్నారు.