మనతెలంగాణ/హైదరాబాద్ : గత రెండు సంవత్సరాలుగా రాష్ట్రంలోని అన్ని వర్గాలను మోసం చేస్తూ వస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ పల్లె ప్రాంతాలపై పగబట్టినట్లు వ్యవహరిస్తోందని, వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసేలా పథకాల అమలును అడ్డుకుంటోందని మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో శనివారం తాండూరు నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన బిఆర్‌ఎస్ సర్పంచులు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కెటిఆర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతులకు అందాల్సిన రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ వంటి కీలక పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం పక్కనబెట్టిందని విమర్శించారు. సాగుకు అవసరమైన కరెంట్ సరఫరాను కూడా అస్తవ్యస్తం చేసి, అన్ని అంశాల్లో ప్రజలను పట్టిపీడిస్తోందని ధ్వజమెత్తారు. రైతాంగం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి లేమివల్లనే నేడు పల్లెల్లో అసంతృప్తి నెలకొందని పేర్కొన్నారు.
గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులు, విధులు రాజ్యాంగం ప్రకారం సంపూర్ణంగా సర్పంచులకే చెల్లుతాయని తెలిపారు. ఇందులో ఏ ఎంఎల్‌ఎకు లేదా రాష్ట్ర ప్రభుత్వానికి జోక్యం చేసుకునే అధికారం లేదన్నారు. తాండూరు నియోజకవర్గంలో బిఆర్‌ఎస్‌కు బలంగా ఉందని, 67 మంది సర్పంచులు గెలవడం శుభపరిణామమని వ్యాఖ్యానించారు. రాబోయే రెండేళ్లు నిధుల పరంగా కొంత ఇబ్బంది ఉన్నా, ప్రజల కోసం గట్టిగా నిలబడాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, చేస్తున్న అప్పులను గ్రామగ్రామాన ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, పార్టీ నేతలు కర్నె ప్రభాకర్, తాండుర్ మాజీ ఎంఎల్‌ఎ పైలట్ రోహిత్ రెడ్డి, నియోజకవర్గ ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.