టి-20 ప్రపంచకప్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జట్టులో శుభ్‌మాన్ గిల్‌ని తప్పించి అతడి స్థానంలో వైస్ కెప్టెన్ బాధ్యతలను అక్షర్ పటేల్‌కి అప్పగించారు. అంతేకాక.. అనూహ్యంగా జితేష్ శర్మపై వేటువేశారు. రెండేళ్లుగా జట్టుకు దూరంగా ఉంటున్న ఇషాన్ కిషన్‌ని జట్టులోకి తీసుకున్నారు. అయితే జితేష్‌ని తప్పించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే అతడిని జట్టులోకి ఎంపిక చేయకపోవడంపై చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పందించాడు. జట్టు కాంబినేషన్ల కోసమే జితీష్‌ను పక్కన పెట్టినట్లు అజిత్ తెలిపాడు.
‘‘జట్టు కాంబినేషన్ల కోసమే టి-20ల్లో వైస్ కెప్టెన్‌గా ఉన్న శుభ్‌మాన్ గిల్‌ను తప్పించాము. అదే విధంగా టాప్ ఆర్డర్‌లో ఆడే వికెట్ కీపర్ మాకు కావాలి. సంజూ శాంసన్ మాకు ప్రధాన వికెట్ కీపర్, ఓపెనర్‌గా ఉన్నాడు. సంజూకు బ్యాకప్ కీపర్, ఓపెనర్‌గా ఇషాన్ కిషన్ సరైనోడని భావించాము. అతడికి ఓపెనర్‌గా మంచి అనుభవం ఉంది. అందుకే జితేష్‌కు బదులు కిషన్‌ను జట్టులోకి తీసుకున్నాము. లోయార్డర్‌లో రింకూ సింగ్ ఫినిషర్‌గా ఉంటాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో జితేష్ స్థానాన్ని రింకూ భర్తీ చేస్తాడు. జితేష్ అద్భుతమైన ప్లేయర్ అయినప్పటికీ.. జట్టు కాంబినేషన్ కోసం ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు’’ అని అగార్కర్ పేర్కొన్నాడు.