మూడు నాలుగేళ్ల క్రితం ఒక రాజకీయ నాయకుడు ముస్లిం మహిళా విలేఖరి ఆర్ఫా ఖానమ్ షేర్వానీకి తన కవిత వినిపించి, అభిప్రాయం చెప్పమన్నాడు. ఆ కవిత పాఠం ఉర్దూలో ఇలా ఉంది.
తస్లీమాత్ మా తస్లీమాత్
తూ భరీ హై మీఠీ పానీ సే
ఫల్ ఫూలోంకి షదాబీ సే
దఖ్కిన్ కీ ఠండీ హవావోంసే
ఫసలోంకి సుహాని ఫిజావోంసే
తస్లీమాత్ మా తస్లీమాత్
తేరీ రాతే రోషన్ చాంద్ సే
తేరి రౌనక్ సబ్జె ఫామ్ సే
తేరీ ప్యార్ భరీ ముస్కాన్ హై
తేరి మీఠా బహుత్ జుబాన్ హై
తెరి బాహోం మే మేరీ రాహత్ హై
తేరే కద్మోం మే మేరీ జన్నత్ హై
తస్లీమాత్ మా తస్లీమాత్
ఈ కవిత వినిపించి దానిపై ఆ నాయకుడు మహిళా విలేఖరి అభిప్రాయాన్ని అడిగాడు. ఆమె ఈ పాటలోని మాతృత్వం పట్ల వ్యక్తమైన ఉదాత్త భావాలను చాలా ప్రశంసించింది. దీన్ని దేశభక్తి గేయంగా పెడితే ఎలా ఉంటుంది అని అడిగితే ఆమె చాలా బాగుంటుంది అన్న జవాబిచ్చింది.
అప్పుడు ఆ రాజకీయ నాయకుడు ఈ రచన జాతీయ గీతమైన వందేమాతరం కి ఉర్దూ అనువాదం. సుజలాం, సుఫలాం, మలయజ శీతలం, సస్యశ్యామలాం, శుభ్రజ్యోత్స్నా పులకిత యామినీ, ఫుల్లకుసుమిత ద్రుమదళ శోభినీం, సుహాసినీం, సుమధుర భాషిణీం అన్న భావాలనే ఈ రచన వ్యక్తీకరిస్తోంది అని చెప్పాడు. మరి మీరు వందేమాతరం గీతాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అని నిలదీశాడు. మహిళా విలేఖరి ఆర్ఫా ఖానమ్ షేర్వానీ నోట మాట పెగల్లేదు. వందేమాతర గీతం పట్ల కొన్ని వర్గాల్లో వ్యక్తమౌతున్న వ్యతిరేకతలోని డొల్లతనాన్ని బరిబాతలగా బట్టబయలు చేసిన ఆ రాజకీయ నాయకుడు ప్రస్తుతం బీహార్ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్.
కత్తి మెడమీద పెట్టినా భారత్ మాతాకీ జైయ్ అనేది లేదనే అసదుద్దీన్ ఒవైసీ, ఈ దేశాన్ని తల్లిగా భావించడం మా మతం ఒప్పదు కాక ఒప్పదనే మతోన్మాదులకీ తెలియని విషయం ఒకటుంది.
ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ బంగ్లాదేశ్ జాతీయగీతం ‘అమార్ శోనార్ బాంగ్లా లో ఓ మా (నా తల్లీ) అన్న పదం నాలుగు సార్లు వస్తుంది. దాన్ని పాడేందుకు మతాంధ జమాతె ఇస్లామీ బంగ్లాదేశ్ కి, మహ్మద్ యూనస్ కి, మరే ఇతర మత సంస్థకీ ఎలాంటి అభ్యంతరాలు లేవు. దక్షిణాన ఉన్న శ్రీలంక తూర్పు భాగమంతా ముస్లింలే ఉంటారు. వారెవరికీ శ్రీలంక జాతీయగీతం
శ్రీలంకా మాతా.. అప శ్రీలంకా
నమోనమోనమో నమో మాతా
సుందర సిరిబరిని
సురేంది అతి శోభమనా లంకా
ధాన్య ధనయనేకా
మాయి పలతురు పిరిజయ భూమియల రమ్య జీవనయే మాతా
పాడటంలో ఎలాంటి ఇబ్బందీ లేదు. మతం అడ్డు రాలేదు. ఈ జాతీయ గీతంలో దేశాన్ని తల్లిగా భావించడం జరిగింది. శ్రీలంక ముస్లిములెవరూ అభ్యంతర పెట్టడం లేదు.
ప్రపంచంలోని అతిపెద్ద ముస్లిం దేశాల్లో ఒకటైన ఇండోనేసియా జాతీయగీతంలో ఒక చరణం ఇండొనీసియా పవిత్ర భూమి, నా పవిత్ర మాతృ భూమి కోసం నేను నిలుచుంటాను అని స్పష్టంగా చెబుతుంది. ఇండోనేసియా ముస్లిం తన దేశాన్ని మాతృభూమిగా భావిస్తాడు. వందేమాతరం అన్న భావాన్నే నిర్మొహమాటంగా, నిస్సంకోచంగా పాడతాడు.
బంగ్లా ముస్లింలకు, శ్రీలంక ముస్లింలకు, ఇండోనేసియా ముస్లింలకు దేశాన్ని తల్లిగా సంబోధించడంలో ఇబ్బంది లేదు. తల్లికి వందనం అనడంలో మతం అడ్డు రాదు. కానీ మన దేశంలోని ముస్లింలకే అభ్యంతరం ఎందుకు? ఈ దేశాలకు దేశాన్ని అమ్మ అనడంతో, అమ్మకు వందనం అనడంలో అడ్డం రాని మతం భారతదేశంలోని కొందరు ముస్లింలకే ఎందుకు వస్తుంది?
వందేమాతరం మొత్తం గీతంలో దేశాన్ని దుర్గగా, లక్ష్మిగా, సరస్వతిగా అభివర్ణించడం మా మతానికి విరుద్ధం అనే వారు బ్రిటన్ కి ఆవురావురుమని వెళ్లి అక్కడి పౌరసత్వం కోసం ఎగబడి, కలబడి అక్కడి నేషనల్ యాంథమ్ గాడ్ సేవ్ ది కింగ్ ని పాడతారే తప్ప గాడ్ అనడం కుదరదు అల్లాయో, ఖుదాయో అంటామని ఎప్పుడైనా, ఎక్కడైనా వాదించారా? లేదా వారు గాడ్, అల్లాహ్ ఒకటేనని అంగీకరిస్తారా? పైగా బ్రిటన్‌లోని ముస్లింలలో ఎక్కువమంది పాకిస్తానీలు (ముఖ్యంగా ఆక్రమిత జమ్మూకశ్మీర్‌కి చెందిన మీర్ పురీలు), బంగ్లాదేశీలు, భారతీయులు.
వీరంతా స్వాతంత్య్రానికి ముందు వందేమాతరంను వ్యతిరేకించిన వారే. భారతీయ ముస్లింలలో చాలా మంది ఇప్పుడూ వ్యతిరేకిస్తున్నారు. కానీ అక్కడ అల్లాహ్‌ని కాక గాడ్‌ని ప్రార్థించడానికి వారికి ఎలాంటి ఇబ్బందీ లేదన్నదే ముఖ్యం.
దుర్గ, లక్ష్మి, సరస్వతి వంటి పేర్లను పలకవలసిన అవసరం లేకుండా కేవలం తొలి చరణాన్నే భారతదేశం స్వీకరించింది. దానిని రాజ్యాంగ నిర్మాణ సభలో సభ్యులైన ముస్లింలు అందరూ ఆమోదించారు. అలాంటి దాన్ని పలకడానికీ కూడా ఎందుకు అభ్యంతరం? ఈ గీతం ఆలపిస్తే లేచి నిలబడటానికి ఏమిటి ఇబ్బంది? దీనికి జవాబు అడగాల్సిన సందర్భం వచ్చింది.
పూర్తి వందేమాతర గీతాన్ని 1923వరకూ కాంగ్రెస్ పార్టీ పాడుతూ వచ్చింది. కాకినాడ కాంగ్రెస్ మహాసభల్లో మౌలానా మహ్మదలీ అభ్యంతరపెట్టడంతో వివాదం మొదలైంది. అంతకు ముందు హిందువులు, ముస్లింలు కలిసి ఈ గీతాన్ని పాడారు. పైగా కాకినాడ మహాసభలకు మహ్మదలీని మేళతాళాలతో ఊరేగించారు. ఆయనకు సంగీత వాయిద్యాలు ఇస్లాం మత విరుద్ధమని గుర్తుకు రాలేదు. మతవాద రాజకీయాల ముందు మోకరిల్లిన నాటి కాంగ్రెస్ నేతలైన గాంధీ, నెహ్రూలు అక్టోబర్ 1937 లో రెండు ముక్కలనే తూతూమంత్రంగా పాడి, తంతును నిర్వహించి సరిపుచ్చాలని నిర్ణయించారు. అంత చేసినా సరిగ్గా పదేళ్లకి 1947 లో దేశం రెండు ముక్కలైంది.
ముందు వందేమాతరం ముక్కలైంది. తరువాత దేశం ముక్కలైంది. అవునా కాదా?
ఈ ప్రశ్నలను వందేమాతర గీత రచనకు 150 సంవత్సరాలైన సందర్భంలో మనల్ని మనం వేసుకోవాలి. స్వాతంత్య్ర స్వర్ణోత్సవ వేడుకల సమయంలో, వందేమాతర గీత రచనకు 150 ఏళ్లవుతున్న సందర్భంలో 2047 లో 1947 పునరావృతం కాకూడదని కోరుకుందాం. పూర్తి వందేమాతర గీతాన్ని సగర్వంగా పాడదాం.
కస్తూరి రాకా సుధాకర్ రావు
(జర్నలిస్ట్)