హెరాయిన్ విక్రయిస్తున్న వ్యక్తిని ఎక్సైజ్ డిటిఎఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది బేగంబజార్‌లో శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 10.5 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న హెరాయిన్ విలువ రూ.60వేలు ఉంటుంది. దినేష్ అనే వ్యక్తి హైదరాబాద్‌లో రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వారికి వంట చేస్తు జీవిస్తున్నాడు. రాజస్థాన్ రాష్ట్రలో తయారు చేసిన హెరాయిన్‌ను తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకుని వచ్చి అవసరం ఉన్న వారికి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎక్సైజ్ సిఐ సృజన, సిబ్బంది కలిసి దాడి చేసి పట్టుకున్నారు. నిందితుడిని కేసు దర్యాప్తు కోసం బేగంబజార్ ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించారు.
పట్టుకున్న విలువ సుమారు.. రూ. 60 వేల మేరకు ఉంటుందని అంచనా వేశారు. కాగా గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వ్యక్తిని ఎక్సైజ్ డిటిఎఫ్ సిబ్బంది అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 200 గ్రాముల గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. మనోజ్‌కుమార్ రెడ్డి అనే వ్యక్తి గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్ సిబ్బందికి సమాచారం రావడంతో సికింద్రాబాద్ డిటిఎఫ్ సిఐ సృజన, సిబ్బంది నిందితుడిపై నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే నిందితుడు గంజాయి చాక్లెట్లు విక్రయిస్తుండగా పట్టుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.