సౌతాఫ్రికాకు చావోరేవో
నేడు చివరి టి20
అహ్మదాబాద్: భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా చివరి టి20 మ్యాచ్ జరుగనుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 21 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది. లక్నోలో బుధవారం జరగాల్సిన నాలుగో టి20 మ్యాచ్ పొగమంచు కారణంగా కనీసం టాస్ కూడా పడకుండానే రద్దయ్యింది. ఇలాంటి స్థితిలో సిరీస్‌ను సమం చేయాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి సఫారీ టీమ్‌ను నెలకొంది. ఇక భారత్ ఈ మ్యాచ్‌లో ఓడినా పెద్దగా నష్టం ఉండదు. 22తో సిరీస్ సమంగా ముగుస్తోంది. ఒకవేళ సౌతాఫ్రికా పరాజయం పాలైతే సిరీస్‌ను కోల్పోక తప్పదు. దీంతో తీవ్ర ఒత్తిడిలో కూరుకు పోయింది. ధర్మశాలలో ఘన విజయం సాధించిన భారత్ ఈ మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఇందులో కూడా గెలిచి సిరీస్‌ను దక్కించుకోవాలనే లక్షంతో ఉంది. అయితే స్టార్ ఆటగాడు శుభ్‌మన్ గిల్ చివరి టి20లో ఆడతాడా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
ఒకవేళ గిల్ దూరమైతే సంజు శాంసన్‌ను తుది జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉంది. అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, తిలక్ వర్మ, శివమ్ దూబె, జితేశ్ శర్మ తదితరులతో భారత బ్యాటింగ్ చాలా పటిష్టంగా ఉంది. అంతేగాక హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్, హార్దిక్, అర్ష్‌దీప్ తదితరులతో బౌలింగ్ కూడా బాగానే ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. సౌతాఫ్రికాలో స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు. క్వింటన్ డికాక్, మార్‌క్రమ్, రిజా హెండ్రిక్స్, స్టబ్స్, బ్రెవిస్, జాన్సన్ వంటి మ్యాచ్ విన్నర్లు జట్టులో ఉన్నారు.దీంతో భారత్‌కు గట్టి పోటీ ఎదురైనా ఆశ్చర్యం లేదు. ఇదిలావుంటే ఈ మ్యాచ్‌కు కూడా పొగమంచు ప్రమాదం పొంచి ఉంది. సాయంత్ర వేళ మంచు కురిసే అవకాశాలు అధికంగా ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ఈ మ్యాచ్ కూడా సాగుతుందా లేదా అనేది సందేహంగా మారింది.