దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాద్ డివిజన్ రైల్వేలో తొలిసారిగా కారుణ్య నియామకాల అదాలత్‌ను డివిజనల్ ప్రధాన కార్యాలయం సంచాలన్ భవన్‌లోని హవా మహల్లో నిర్వహించారు. మరణించిన ఉద్యోగుల యొక్క అర్హత కలిగిన కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పించడానికి వేగవంతమైన, నిష్పక్షపాతమైన, పారదర్శకమైన, కాలపరిమితితో కూడిన కారుణ్య నియామకాలను నిర్ధారించే లక్ష్యంతో ఈ అదాలత్ ఒక ప్రత్యేకమైన కార్యక్రమంగా చేపట్టినట్లు రైల్వే వెల్లడించింది. ఈ అదాలత్‌లో 49 మంది కారుణ్య నియామకాలను ఆశిస్తున్న అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ డాక్టర్ ఆర్. గోపాలకృష్ణన్ సమర్థవంతమైన మార్గదర్శకత్వం, నాయకత్వంలో ఈ అదాలత్ నిర్వహించారు. ఉద్యోగం చేస్తూ మృతి చెందిన ఆయా కుటుంబాల ఆందోళనలను పరిష్కరించడంలో ఈ అదాలత్ కీలకమని తెలిపారు. డివిజనల్ రైల్వే మేనేజర్, అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్, ఆపరేషన్స్ స్వయంగా బాధిత కుటుంబాలతో మాట్లాడి వారికి తక్షణ ఉపశమనం, భరోసాను అందించారు.
అర్హులైన అభ్యర్ధులందరినీ ఒకే వేదికపైకి తీసుకువస్తూ , తద్వారా ప్రస్తుత నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ సత్వర నిర్ణయం తీసుకోవడానికి ఈ కారుణ్య నియామకాల అదాలత్ వీలు కల్పించిందని రైల్వే పేర్కొంది. సెటిల్మెంట్, నూతన పెన్షన్ పథకం, కాంప్లిమెంటరీ పాస్‌లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న మొత్తం సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. అదనంగా, రైల్వే జీతం ప్యాకేజీ, ప్రమాద, సాధారణ మరణ బీమా పథకాల గురించి అవగాహన కల్పించడానికి బ్యాంకు అధికారులను కూడా ఆహ్వానించారు. ఈ చొరవ ఇతర డివిజన్లు, జోనల్ రైల్వేలలో, ఫిర్యాదుల పరిష్కారం, సంక్షేమ- ఆధారిత పాలనకు ఒక మార్గదర్శక నమూనాగా నిలుస్తూ వాటిని పాటించడానికి ఒక ప్రమాణాన్ని నిర్దేశిస్తుందని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు. కారుణ్య నియామకాల అదాలత్‌ను సమర్థవంతంగా, సజావుగా నిర్వహించడంలో డివిజనల్ అధికారులు, సంక్షేమ ఇన్స్పెక్టర్లు, పర్సనల్ బ్రాంచ్ సిబ్బంది బృందం అంకితభావంతో, స
మన్వయంతో చేసిన కృషి కీలక పాత్ర పోషించాయని స్పష్టం చేశారు. మృతుల రైల్వే కుటుంబ సభ్యులు, పరిపాలన మధ్య అంతరాన్ని తగ్గించడానికి ఈ వినూత్నమైన చొరవను చేపట్టినందుకుగాను సికింద్రాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్, వారి బృందాన్ని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ అభినందించారు. సమస్యలను పరిష్కరించడానికి మరియు అర్హత కలిగిన కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పించడానికి తీసుకున్న చురుకైన చర్యలను జనరల్ మేనేజర్ ప్రశంసించారు.
…………………