“నాకు మంత్రి పదవి వస్తుందని ఆశిస్తున్నా..” అని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తనకు తప్పకుండా మంత్రి పదవి ఇస్తామని పార్టీ అధిష్టానం హామీ ఇచ్చిందని ఆయన శుక్రవారం తెలిపారు. తనకు తప్పనిసరిగా మంత్రి పదవి లభిస్తుందనే ఆశాభావంతో ఉన్నానని, అయితే మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు ఉంటుందనేది చెప్పలేనని అన్నారు. కాంగ్రెస్‌లో చేరే సమయంలోనే మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం మాట ఇచ్చిందని ఆయన శుక్రవారం ‘మన తెలంగాణ’ ప్రతినిధితో మాట్లాడుతూ తెలిపారు. తాను నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నానని, మంత్రి పదవి ఉంటే మ రింత అభివృద్ధి చేయవచ్చన్నది తన భావన అని ఆయన తెలిపారు. తనకు మంత్రి పదవి కంటే నియోజకవర్గం ప్రజల అభివృద్ధే ముఖ్యమని అన్నారు. అన్నదమ్ములకు మంత్రి పదవి ఇవ్వడం ఎలా సాధ్యమవుతుందని పార్టీలో కొంత మంది చేస్తున్న వాదనను ఆయన ప్రస్తావిస్తూ మాట ఇచ్చేప్పుడు తెలియదా?, ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నప్పుడు అన్నదమ్ములని తెలియదా? అని ఆయన ప్రశ్నించారు. ఇద్దరు ఉంటే తప్పేమిటని రాజగోపాల్ రెడ్డి పలుసార్లు విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ప్రశ్నించిన సంగతి తెలిసిందే.