బంగ్లాదేశ్ లో గత జూలైలో జరిగిన ఉద్యమ నాయకుడు ఉస్మాన్ హది మరణం పై దేశంలో పలు ప్రాంతాలలో శుక్రవారం నాడు మొదలైన నిరసనలు హింసాకాండకు, విధ్వంసానికి దారితీశాయి. పెద్దఎత్తున అరాచకం నెలకొంది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. శుక్రవారం ఉదయం పెద్దగా హింసాత్మక ఘటనలు జరగకున్నా. బంగ్లాదేశ్ వ్యవస్థాపక నాయకుడు షేక్ ముజిబుర్ రెహమాన్ నివాసం వద్ద ఇప్పటికే కూల్చివేసిన నిర్మాణాన్ని మొదట కొందరు నిరసనకారులు ధ్వంసం చేశారు. ఛాటోగ్రామ్ ప్రాంతంలోని అసిస్టెంట్ ఇండియన్ హై కమిషనర్ నివాసంపై కొందరు రాళ్లు రువ్వారు. ఢాకాలో హింసా కాండకు పాల్పడుతున్న నిరసన కారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్, ప్రయోగించారు. లాఠీ చార్జి చేశారు. 12 మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలలో పలువురు గాయపడినట్లు తెలిసింది.బంగ్లాదేశ్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమమద్ యూనస్ టెలివిజన్ లో ప్రసంగిస్తూ, ఇంక్విలాబ్ మంచా లీడర్ హాది మరణాన్ని ధృవీకరించిన తర్వాత అల్లర్లు చోటు చేసుకున్నాయి. హాదీ పై డిసెంబర్ 12న అనూహ్యంగా ఢాకాలో దుండగులు కాల్పులు జరిపారు. మెరుగైన చికిత్సకోసం సింగపూర్ తరలించగా అక్కడ గురువారంనాడు ఆయన మరణించారు. దీంతో గురువారం రాత్రినుంచే ఆయన మద్దతు దారులు అల్లర్లకు తెలపడ్డారు. గురువారం అర్థరాత్రి సమయంలో నిరసనకారులు బెంగాలీ భాషా దినపత్రిక, ఆంగ్ర పత్రిక భవనాలకు నిప్పంటించారు. మొదట ప్రోథోమ్ అలో కార్యాలయాన్ని ధ్వంసం చేసి ఆ తర్వాత దినపత్రికల కార్యాలయాలకు నిప్పు పెట్టారు.రాజ్ షాహి నగరంలో అవామీలీగ్ పార్టీ కార్యాలయాన్ని కూడా ధ్వంసంచేశారు.
ఇదే నేపథ్యంలో భారత వ్యతిరేకులైన అల్లరి మూక దాడిలో మైమెన్ సింగ్ జిల్లా లోని భలుకా సబ్ డిస్ట్రిక్ట్ లో దీపు చంద్ర దాస్ అనే హిందు యువకుడు చనిపోయాడు. ఇస్లాంను అవమానించారని ఆరోపణపై ఈ దాడి జరిగింది. విచక్షణ కోల్పోయిన నిరసనకారులు అతడి మృతదేహాన్ని తగులపెట్టారని బంగ్లాదేశ్ మీడియా వెల్లడించింది. హాధీ మరణానంతరం హింసాత్మక నిరసనలు చెలరేగుతున్న సమయంలోనే ఈ సంఘటన జరిగింది. హిందూ వ్యక్తి హత్యను కూడా ముహమ్మద్ యూనస్ ఆధ్వర్యంలోని బంగ్లా ప్రభుత్వం ఖండించింది. కొత్త బంగ్లాదేశ్ లో అలాంటి హింసకు చోటులేదని పేర్కొంది.ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తులను వదిలి పెట్టబోమని ప్రకటించింది.కాగా, వచ్చే ఫిబ్రవరి నెలలో బంగ్లాదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ అల్లర్లు చోటు చేసుకోవడం విశేషం, రానున్న ఎన్నికలలో హాది అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గతవారం సెంట్రల్ ఢాకా లోని బిజోయ్ నగర్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తుండగా ముసుగు ధరించిన దుండగులు ఆయన పై కాల్పులు జరిపారు. సింగపూర్ లో ఆరు రోజుల మృత్యువుతో పోరాడి హాది చనిపోయారు.గురువారం రాత్రి ఢాకా యూనివర్సిటీలో విద్యార్థులు, నేషనల్ సిటిజన్స్ పార్టీ ఆధ్వర్యంలో సంతాప సభ అనంతరం ఊరేగింపు జరిగింది. హాది పై దాడి చేసి హత్యచేసిన దుండగులు తర్వాత భారతదేశానికి పారిపోయారని ఆరోపిస్తూ వారు భారత వ్యతిరేక నినాదాలు చేశారు. హంతకులు తిరిగి వచ్చే వరకూ భారత హై కమిషన్ ను మూసివేయాలని వారు బంగ్లా తాత్కాలిక ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.