మన తెలంగాణ/హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించేందుకు పార్టీ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. పిసిసి అధ్యక్షునిగా బిసి సామాజి క వర్గానికి చెందిన ఎమ్మెల్సీ మహేష్ కుమార్‌గౌడ్ ఉన్నందున, ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీ, రెడ్డి సామాజిక వర్గం నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించి సామాజిక సమతుల్యత పాటించాలని పార్టీ నాయకత్వం భావించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇటీవల ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీ, రెడ్డి కులాలకు ప్రాతినిధ్యం కల్పిస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ మేరకు పార్టీ అధిష్ఠానం శుక్రవారం సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఎంపిక చేసే వారి జాబితాను పార్టీ అధిష్ఠానం కోరినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఈ మేరకు ఒకటి, రెండు రోజుల్లోనే వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం జరగనున్నది. దీంతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని పార్టీ నాయకులు, కార్యకర్తలు అంటున్నారు.