మన తెలంగాణ ప్రతినిధి, గద్వాల: భార్యను భర్త హత్య చేసిన సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల పరిధిలోని నెట్టెంపాడు గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకున్నది. గ్రామానికి చెందిన గోవిందు(32), జమ్మలమ్మలు(28) భార్యాభర్తలు. గురువారం రాత్రి భోజనాలు చేశాక ఇంట్లో నిద్రించారు. చిన్న విషయానికి గొడవపడ్డారు. పెద్దకొడుకు మల్లికార్జున్ అడ్డు వచ్చాడు దీంతో కట్టేతో తలపై కొట్టడంతో ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో భార్య కేకలు వేయడంతో బయట ఉన్నవారు వచ్చి ఇంటి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. బయటకు వచ్చిన తర్వాత భార్యను వెంటాడి కట్టేతో తలపై బలంగా పలుమార్లు కొట్టి చంపేశాడు. తెల్లవారుజామున పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాగా నిందితుడు గోవిందు సైకోగా వ్యవహరించేవాడని, గతంలో కూడా తండ్రిని చంపినట్లు ఆరోపణలు ఉన్నాయని గ్రామస్తులు తెలిపారు. గతంలో ఆయనకు మెంటల్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ కూడా అందించారని అందువల్లే చంపి ఉంటాడని భావిస్తున్నారు. సంఘటన స్థలాన్ని సీఐ శీను, ధరూర్ ఎస్సై పరిశీలించారు.