ఎడారి దేశం యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్ (యుఎఇ)లో అకాల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రకృతి వైపరీత్య పరిణామంతో దేశంలోని పలు నగరాలు తల్లడిల్లుతున్నాయి. దుబాయ్ , అబూధాబి ఇతర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా, అపరిచిత అపరిమిత స్థాయిలో కురుస్తోన్న వర్షాలతో జన జీవితం స్తంభించింది. పలు చోట్లా ప్రత్యేకించి దుబాయ్ వంటి పలు ఆకాశహార్మాలు ఉండే నగరంలో పరిస్థితి దారుణంగా మారింది. ఉరుకులు పరుగుల నగరంలో జనం రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అనేకులు ఎతైన భవనాలలోనే తలదాచుకుంటున్నారు. గత ఏడాది అంతకు ముందు కొన్ని సంవత్సరాల క్రితం కూడా దుబాయ్ ఇతర ప్రాంతాలలో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు భయానక అనుభవాలను మిగిల్చి వెళ్లాయి. అంతర్జాతీయ ప్రయాణికులను కొన్ని రోజుల పాటు విమానాశ్రాయాలలో బందీలుగా ఉంచిన భారీ వర్షాల పరిస్థితి ఇప్పుడు తిరిగి నెలకొంది. దుబాయ్‌లోని వీధులు ఇప్పుడు పెద్ద పెద్ద చెరువులుగా మారాయి. . ఎక్కువగా సరదాగా తిరిగే ఇక్కడి జనం నివాసాలలోనే కూర్చోవల్సి వచ్చింది.
ఇక్కడి ప్రఖ్యాత , ప్రపంచంలోనే ఎతైన బుర్జ్ ఖలీఫా భారీ వర్షాల దశలో పిడుగుపాటుకు గురైంది. పండుటాకులా వణికింది. అయితే అంతకుముందు ఇక్కడ అమర్చిన అనేక సాంకేతిక భద్రతా పరికరాలతో ఈ కట్టడం చెక్కుచెదరకుండా నిలిచింది. పిడుగుపాటును తట్టుకుంది. నగరంలోని పలు ప్రాంతాలలో సహాయక బృందాలు రాత్రింబవళ్లూ తిరుగుతూ ప్రజలను ఆదుకుంటున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా జాగ్రత్త వహించారు. బుర్జ్ ఖలీఫాపై పిడుగు పడ్డ దృశ్యాలను దుబాయ్ యువరాజు షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీదు అల్ మక్తూమ్ సోషల్ మీడియాలో పొందుపర్చారు. దుబాయ్ అనే శీర్షికతో ఈ వీడియో వెలువడింది. అల్ బషాయర్ పేరిట నెలకొన్న అల్పపీడనంతో దేశంలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. దీనితో దేశంలో వాతావరణం అస్థిరంగా మారింది. భారీ వర్షాలతో గోడకూలిన ఘటనలో రాస్ అల్ ఖైమాలో 27 సంవత్సరాల భారతీయుడు సల్మాన్ ఫరీజు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. భారత్‌లోని ఆయన సన్నిహితులకు విషయం తెలిపారు.