అమెరికాలో గ్రీన్ కార్డు లాటరీ ప్రోగ్రామ్‌ను నిలిపివేశారు. ఈ మేరకు శుక్రవారం దేశాధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఉత్తర్వులు వెలువరించారు. ఇటీవలి కాలంలో బ్రౌన్ యూనివర్శిటీ, ఎంఐటిలలో జరిగిన కాల్పుల ఘటనల పర్యవసానంగా ట్రంప్ ఈ లాటరీ వీసా వెసులుబాటును రద్దు చేశారు. కాల్పులకు దిగిన వ్యక్తులు తమకు అందుబాటులోకి వచ్చిన గ్రీన్‌కార్డు లాటరీ విధానం వాడుకునే అమెరికాలోకి దాడుల వ్యూహంతోనే అధికారికంగానే ప్రవేశించారని వెల్లడైంది. ఈ ఘటనల్లో ఇద్దరు మృతి చెందారు . పోర్చుగిస్‌కు చెందిన క్లాడియో నెవెస్ వాలెంటి ఈ ఘటనలో ప్రధాన నిందితుడు. ఈ వ్యక్తి ఈ వీసా పద్ధతి ద్వారానే అమెరికాలోకి చేరాడనే విషయం నిర్థారణ అయింది. దీనితోనే ప్రెసిడెంట్ స్పందించారని హోం ల్యాండ్ సెక్యూరిటీ సెక్రెటరీ క్రిస్టి నోయెమ్ ఎక్స్ సామాజిక మాధ్యమం ద్వారా తెలిపారు. 48 సంవత్సరాల వాలెంట్ జరిపిన కాల్పుల్లో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు.
తొమ్మండుగురు గాయపడ్డారు. ఇక ఎంఐటిలో జరిగిన కాల్పుల్లో ప్రొఫెసర్ బలి అయ్యారు. నిందితుడు అయిన నెవెస్ బ్రౌన్ వర్శిటీలోనే స్టూడెంట్ వీసాపై 2000 సంవత్సరంలో చదివాడు. 2017లో బహుళార్థక ఇమిగ్రేంట్ వీసాను పొందాడు, తరువాత లాటరీ పద్ధతిని వాడుకుని అమెరికా శాశ్వత నివాసత్వం పొందాడని పోలీసు డిటెక్టివ్‌లు తమ విచారణ క్రమంలో నిర్థారించారు. గ్రీన్‌కార్డులాటరీ విధానం వల్ల తలెత్తిన అనర్థం గురించి తెలియగానే ట్రంప్‌పై తీవ్ర విమర్శలు తలెత్తాయి. ఈ వైవర్సీటి వీసా ప్రోగ్రాంతో ఏటా 50 000 వరకూ గ్రీన్‌కార్డులు జారీ అవుతున్నాయి. కొన్ని దేశాల వారు ఈ విధానం వాడుకుని అమెరికాలో ప్రవేశించి అదును చూసుకుని దాడులకు దిగుతన్న విషయం దేశవ్యాప్తంగా కలవరానికి దారితీసింది. భిన్న జాతుల వారికి అమెరికాలో చట్టబద్ధమైన ప్రవేశానికి తరువాతి దశల్లో వారికి గ్రీన్‌కార్డుల జారీకి లాటరీ విధానం దగ్గరిదారి అయింది. అత్యంత ప్రమాదకరమైన వ్యక్తులు ఏ విధంగా కూడా దేశంలోకి చేరుకోవడానికి వీల్లేదని, ఈ దిశలో అన్ని చర్యలూ తీసుకోవాలని ట్రంప్ ఆదేశించారని అధికార వర్గాలు తెలిపాయి.