మూడు దశల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో చాలా జిల్లాలో బిఆర్‌ఎస్ మొదటి స్థానంలో ఉందని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. అత్యధిక స్థానాల్లో బిఆర్‌ఎస్ పార్టీ మద్దతుదారులు గెలిచారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడినా అత్యధిక స్థానాల్లో బిఆర్‌ఎస్ గెలిచిందని చెప్పారు. కొన్ని జిల్లాలో 50 శాతం అధికార పార్టీ,50 శాతం బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారని, మిగిలిన చోట్ల బిఆర్‌ఎస్ మద్దతుతో కొందరు గెలిచారని పేర్కొన్నారు. ఈ పలితాలు చూస్తుంటే అధికార కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుందని అన్నారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం బిఆర్‌ఎస్ నేతలు దేవీప్రసాద్, మెతుకు ఆనంద్‌లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ఏ ముఖ్యమంత్రి ప్రచారం చెయ్యలేదని, ఇప్పుడున్న ముఖ్యమంత్రి స్వయంగా హెలికాప్టర్ వేసుకొని స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం నిర్వహించారని విమర్శించారు. అయినా ప్రజలు బిఆర్‌ఎస్ పార్టీనీ గెలిపించారని అన్నారు.
పాలన గొప్పగా లేనందునే కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో ఓడిపోయిందని పేర్కొన్నారు. తమ హయంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం చెయ్యలేదు, తమకొచ్చిన సీట్ల గురించి గొప్పగా చెప్పుకోలేదని అన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇతర పార్టీలకు 5 నుంచి 10 శాతం మాత్రమే పలితాలు వచ్చేవి అని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము ఇన్ని స్థానాలు గెలిచామని మీడియా సమావేశం పెట్టుకొని చెబుతున్నారని విమర్శించారు. దానికి తోడు తమ పార్టీ నాయకుల మీద ఆరోపణలు చేశారని మండిపడ్డారు. కెసిఆర్‌పైన, కెటిఆర్, హరీష్ రావు పైన రేవంత్‌రెడ్డి ఏది పడితే అది మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్ ఆరోగ్యంపై రేవంత్ రెడ్డి హేళన చేసి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. యాక్టివ్‌గా ఉండే రాహుల్ గాంధీ బీహార్ రాష్ట్రానికి వెళ్లి ప్రచారం చేస్తే 4 సీట్లు వచ్చాయని ఎద్దేవా చేశారు.
కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని మాట్లాడిన రేవంత్ రెడ్డి వెంటనే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేశారని గుర్తు చేశారు. కెటిఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సక్సెస్ అయ్యారని తెలిపారు. కెటిఆర్ మంత్రిగా ఉన్నప్పుడు అత్యధిక స్థానాల్లో మున్సిపాలిటీలు గెలిచామని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరు చెడిపేసే ప్రయత్నం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ మౌనంగా ఉంటుందని విమర్శించారు. తెలంగాణ జలవనరులపై జరుగుతున్న కుట్రలపై ఈనెల 21న కెసిఆర్ వివరిస్తారని తెలిపారు.