మనతెలంగాణ/హైదరాబాద్:రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుతమైన ఫలితాలు సాధించిందని, ఈ ఫలితాలు తమ రెండేళ్ల పరిపాలనకు ప్రజలు ఇచ్చిన తీ ర్పు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ఫలితాలు తమ బాధ్యతను మరింత పెంచాయని, భవిష్యత్‌లో మరింత బాధ్యతతో పని చేస్తామని, రానున్న ఎన్నికల్లో ఇదే ఫలితాలు వస్తాయని సిఎం రేవంత్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. 2029లోనూ కాంగ్రెస్ పార్టీదే విజయమని, 2/3 మెజార్టీతో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్య క్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్‌ఎస్, బిజెపి రెం డు కూటమిగా కలిసి పోటీ చేశాయని, అయినా కాంగ్రెస్ ప్ర భుత్వంపై ప్రజలు సంపూర్ణ విశ్వాసం చూపించారన్నారు. 94 శాసనసభ నియోజకవర్గాల్లో ఈ పంచాయతీ ఎన్నికలు జరిగాయని, అందులో 87 శాసనసభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఆధిక్యం సాధించిందని ఆయన పేర్కొన్నారు.
ఇక, బిఆర్‌ఎస్ 6 నియోజకవర్గాల్లో మెజార్టీ స్థానాలు సాధించగా ముథోల్ నియోజవర్గంలో బిజెపి అధిక స్థానాలను గెలుచు కుందని ఆయన తెలిపారు. 7,527 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ, బిఆర్‌ఎస్ 3,511 పంచాయతీల్లో, బిజెపి 710 పంచాయ తీల్లో గెలుపు సాధించాయని ఆయన తెలిపారు. స్థానిక సం స్థలు ఎన్నికలు ప్రశాంతంగా ప్రజాస్వామ్య బద్ధంగా జరిగా యని, పార్టీ విజయం కోసం కష్టపడిన కాంగ్రెస్ కార్యకర్తల కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్‌లోని తన ని వాసంలో గురువారం మీడియా తో సిఎం రేవంత్ రెడ్డి మా ట్లాడుతూ ప్రజాపాలనకు సంబంధించి రెండేళ్ల సంబరాలు జ రుపుకుంటున్నామన్నారు. అదే సమయంలో సర్పంచ్ ఎన్ని కల్లో అద్భుత ఫలితాలు వచ్చాయన్నారు. ప్రజలు కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారని, ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లోనూ తమకే మద్ధతు తెలిపారన్నారు. అర్బన్ తెలంగాణతో పాటు రూరల్ తెలంగాణలో ప్రజలు తమకు అండగా నిలిచారన్నారు.
66 శాతం స్థానాల్లో కాంగ్రెస్‌తో గెలుపు
సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై వివిధ రకాల విశ్లేషణలు జరుగుతున్నాయని సిఎం అన్నారు. మొత్తం 12,702 సర్పంచ్ స్థానాలకు గాను 7,527 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు, 808 స్థానాల్లో కాంగ్రెస్ రెబల్స్ గెలిచారని ఆయన చెప్పారు. ఈ ఎన్నికల్లో బిఆర్‌ఎస్, బిజెపిలు కూటమిగా 4,224 స్థానాలు గెలుచుకున్నాయన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో రెబల్స్ తో కలిపి 66 శాతం కాంగ్రెస్ గెలుచుకుంటే బిఆర్‌ఎస్, బిజెపి కలిపి 33 శాతం స్థానాలు గెలుచుకున్నాయన్నారు. కాంగ్రెస్ గెలిచిన అసెంబ్లీ స్థానాలతో పాటు మరో 21 నియోజకవర్గాల్లో ప్రజలు తమవైపు నిలిచారన్నారు. పేదలకు తాము అందిస్తున్న సంక్షేమ పథకాలే తమ విజయానికి కారణమని ఆయన తెలిపారు.
కోర్టు చీవాట్లు పెట్టినా సోనియా, రాహుల్ గాంధీలపై
సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ తీసుకువచ్చిన మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలని కేంద్రం చూస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. నరేగా పేరు మార్చడమే కాకుండా విధానాలు మార్చి పేదలకు ఈ పథకం అందకుండా చేయాలని కక్ష, కుట్ర కేంద్ర ప్రభుత్వంలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కోర్టు చీవాట్లు పెట్టినా సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై అక్రమ కేసుల విషయంలో వారు మారకపోవడం కళ్లతో చూస్తున్నామన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పక్షాన నిలబడ్డారన్నారు. భవిష్యత్‌లో ఇంకా బాధ్యతతో, మరింత బలంగా పని చేస్తామన్నారు.
మూసీ కంటే ఆయన కడుపులోనే విషం ఎక్కువ..
ప్రతిపక్షంలో ఉన్నవారికి అధికారం కోల్పోయినా అహంకారం తగ్గలేదని ఆయన మండిపడ్డారు. ఇంకొకాయన కడుపు నిండా విషయం పెట్టుకొని మాట్లాడుతున్నారని సిఎం రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు. మూసీలోని కాలుష్యం కంటే ఆయన కడుపులోనే ఎక్కువ విషం ఉందని ఇకనైనా ఇప్పటికైనా అహంకారం, అసూయ తగ్గించుకోవాలని బిఆర్‌ఎస్ నాయకులను సిఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. బరితెగించి వ్యవహారిస్తామంటే ప్రజలు గమనిస్తున్నారని, ప్రజాతీర్పును గౌరవించి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు సహకరించాలని ముఖ్యమంత్రి సూచించారు. దేశంలోనే తెలంగాణను నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దామని ఆయన తెలిపారు.
స్పీకర్ నిర్ణయం నచ్చకపోతే కోర్టుకు వెళ్లొచ్చు
ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై ఎం రేవంత్ రెడ్డి స్పందించారు. స్పీకర్ నిర్ణయంపై తాము స్పందించమని, ఎవరికైనా స్పీకర్ నిర్ణయం నచ్చకపోతే కోర్టుకు వెళ్లొచ్చని ఆయన తెలిపారు. బిఆర్‌ఎస్‌కు 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని స్వయంగా హరీష్ రావే చెప్పారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. అందుకు తగ్గట్టుగా సభలో సమయం ఇవ్వాలని హరీష్‌రావు కోరారని ఆయన అన్నారు. సభలో సభ్యుల సంఖ్యపై స్పీకర్ బులిటెన్ సైతం విడుదల చేశారని, అప్పుడు అభ్యంతరం చెప్పని బిఆర్‌ఎస్ నేతలు ఇప్పుడు దానిని ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
కెసిఆర్ క్రియాశీల రాజకీయాల్లో లేరు
ప్రస్తుతం ఆ పార్టీ అధినేత కెసిఆర్ క్రియాశీల రాజకీయాల్లో లేరని, గజ్వేల్ ప్రజలు కూడా ఆయన మీద పెట్టుకున్న ఆశ వదులుకున్నారన్నారు. కెసిఆర్ క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నప్పుడే ఆయన్ను ఓడించి అధికారంలోకి వచ్చామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. అధినేతలు ఉన్న పార్టీలో క్రమశిక్షణగా ఉంటాయని, నాయకుడు లేని పార్టీలు బిఆర్‌ఎస్ మాదిరిగానే ఉంటాయని సిఎం రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ప్రజాస్వామ్యబద్దంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించామని ఆయన అన్నారు. ప్రతిపక్షాల మీద కక్షసాధింపు చర్యలు తమ ప్రభుత్వం చేయలేదన్నారు. ఈ ఎన్నికల్లో కూడా ప్రజలు స్వేచ్చగా పోటీ చేసి ఓట్లు అడిగారని సిఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హోదాలను అడ్డుపెట్టుకొని ఎన్నికలను ప్రభావితం చేసేలా తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, గెలిస్తే కళ్లు నెత్తికెక్కినట్టుగా తాము ఏనాడు వ్యవహారించలేదని సిఎం రేవంత్ తెలిపారు.
గోదావరి, కృష్ణా జలాలపై చర్చించడానికి సిద్ధం
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కెసిఆర్‌కు సవాల్ విసిరారు. ప్రతిపక్ష నాయకుడిగా కెసిఆర్ లేఖ రాస్తే కృష్ణాజలాలపై ఎవరు అన్యాయం చేశారో చర్చ చేయడానికి తాను సిద్ధమని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి ఎప్పుడంటే అప్పుడు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. గోదావరి, కృష్ణా జలాలపై తాము ఎప్పుడైనా చర్చించడానికి సిద్ధమని ఆయన తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి కంటే బిఆర్‌ఎస్ హయాంలోనే తెలంగాణకు తీరనిద్రోహం ఆ పార్టీ చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 42 శాతం రిజర్వేషన్‌లపై ప్రజాస్వామ్యబద్ధంగా అసెంబ్లీలో చర్చ చేసిన తరువాతే ముందుకు వెళతామని ఆయన తెలిపారు.
కెటిఆర్‌ను తప్పించాలని హరీష్‌రావు వర్గం యత్నం….
కెటిఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాత జరిగిన ఎన్నికల్లోనూ బిఆర్‌ఎస్ గెలవలేదని సిఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కెటిఆర్‌ను తప్పించాలని హరీష్‌రావు వర్గం సోషల్‌మీడియాలో ప్రచారం మొదలు పెట్టిందని ఆయన తెలిపారు. అందుకే ఈ విషయం చర్చకు రాకుండా కెటిఆర్ జిల్లాల పర్యటనలు మొదలుపెట్టారని ఆయన ఎద్దేవా చేశారు.
ఆరు గ్యారంటీలతో పాటు ఏడో గ్యారంటీగా ప్రజలకు స్వేచ్ఛను
పేదలకు తాము అందించిన సన్నబియ్యం, సన్నవడ్లకు బోనస్, రూ.500లకే సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత కరెంట్, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు, ఎస్సీ వర్గీకరణ అమలు, కులగణన, ఇతర పథకాలతో ప్రజలను తమను ఆదరించారని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆరు గ్యారంటీలతో పాటు ఏడో గ్యారంటీగా ప్రజలకు స్వేచ్ఛను అందించామని ఆయన అన్నారు.